Pension Distribution Arrangements: సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 1వ తేదీన అమరావతి పరిధిలోని తాడేపల్లి మండలం పెనుమాకలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. చంద్రబాబు స్వయంగా పింఛన్ లబ్ధిదారులకు నగదు అందించనున్నారు. ఉదయం 6 గంటలకే పింఛన్‌దారులకు పాత బకాయిలతో కలిపి మొత్తం 7 వేల రూపాయల నగదు అందజేయనున్నారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు లబ్ధిదారులు, ప్రజలతో మాట్లాడనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65 లక్షల 18 వేల 496 మంది లబ్దిదారులకు 4 వేల 408 కోట్ల రూపాయలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్దిదారులకు నగదు అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సామాజిక పింఛనుదారుల భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని, వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే తక్షణ కర్తవ్యంగా భావించి ముందడుగు వేశామని సీఎం తెలిపారు.
మీ కష్టాలు చూసి చలించిపోయా - పింఛన్‌దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ - CM Chandrababu Open Letter
ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్టు అధికారం చేపట్టిన తొలి నెలలోనే పెంచిన ఫించన్ వెయ్యి రూపాయలు కలిపి 4 వేల రూపాయలు అందజేస్తున్నామన్నారు. అలాగే ఏప్రిల్ నుంచే ఇస్తామన్న హామీ మేరకు ఆ మూడు నెలలు బకాయిలు కూడా ఇస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. దివ్యాంగులకు ఒకేసారి 3 వేలు పెంచామని, జులై నుంచి 6 వేల చొప్పున పెంచిన పింఛన్ అందజేయనున్నట్లు తెలిపారు. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు 819 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. గడిచిన మూడు నెలలకు పెంపును వర్తింపజేయనుండటంతో మరో 1,650 కోట్లు అదనంగా అందజేయనున్నారు.
ఇకపై ప్రజల ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ: దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా జులై 1న 4,408 కోట్లను పింఛన్ల రూపంలో ప్రజలకు అందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛను విధానానికి ఆద్యుడు అయిన ఎన్టీఆర్ పేరుతో ‘ఎన్టీఆర్ భరోసా పథకం’గా సామాజిక భద్రత పింఛన్లు ఇకపై ప్రజల ఇంటి వద్దే పంపిణీ చేస్తామని స్పష్టంచేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్లను అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితోపాటు ఇతర శాఖలకు చెందిన క్షేత్రస్థాయి ఉద్యోగులను వినియోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులకు సూచించారు.