Krishna Water Dispute : కృష్ణా జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ఇచ్చిన మార్గదర్శకాలను, అంతర్రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 ప్రకారం 2023 అక్టోబర్‌లో ఇచ్చిన తదుపరి సూచనలను కలిపి వినాలన్న తెలంగాణ వాదనను ఏపీ వ్యతిరేకించింది. బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్‌కు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన సమాధానం ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన రెండు నోటిఫికేషన్లు పరస్పరం భిన్నమైనవని పేర్కొంది. తెలంగాణ వాటిని తప్పుగా అర్థం చేసుకుందని తెలిపింది.
అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 5(23), 12లోని అధికారాలను వినియోగించుకొని పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89లోని నిబంధన ఎ, బి కింద తదుపరి నివేదిక ఇవ్వాలని 2014 మే 15న కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ట్రైబ్యునల్ని ఆదేశించిందని ఏపీ పేర్కొంది. అంతర్రాష్ట్ర జల వివాద చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రైబ్యునల్ ప్రాజెక్టుల వారీ కేటాయింపులు చేయనిపక్షంలో చేయాలని, నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీగా నీటి విడుదలకు ఆఫరేషన్ ప్రొటోకాల్ నిర్ణయించాలని సూచించిందని తెలిపింది.
ఆ ప్రకారం నిర్ణయించిన తేదీకి ముందు ప్రాజెక్టుల వారీగా ట్రైబ్యునల్ అవార్డులు ఉన్న పక్షంలో వాటిని పునర్విభజన ద్వారా ఏర్పడే రాష్ట్రాలు గౌరవించాల్సి ఉంటుందని ఏపీ వివరించింది. దీనికి సంబంధించి సాక్ష్యాల సేకరణ గత సంవత్సరం మార్చి 23తో ముగిసిన తర్వాత సెక్షన్ 89 కింద ప్రధాన కేసు వాదనలు 2023 అక్టోబర్ 18న ప్రారంభమైనట్లు తెలిపింది. అంతర్రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 ప్రకారం తదుపరి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌ను 2023 అక్టోబర్ 6న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిందని పేర్కొంది. దీనిని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ 2023 అక్టోబర్ 31న సుప్రీంకోర్టును ఆశ్రయించిందని వెల్లడించింది.
ట్రైబ్యునల్ ఎదుట ఏపీ వాదనలు వినిపించాలని, రిట్ పిటిషన్ తుది తీర్పునకు లోబడి ఉంటుందని 2023 నవంబర్ 7న సుప్రీంకోర్టు చెప్పిందని వివరించింది. తాము దాఖలు చేసిన రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తెలంగాణ కోరినట్లుగా రెండూ కలిపి వాదనలు వినడానికి వీల్లేదని తెలిపింది. మొదట పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం వేరుగా వాదనలు వినాల్సిన అవసరం ఉందని ట్రైబ్యునల్‌కు ఆంధ్రప్రదేశ్ విన్నవించింది.
సాగర్ కుడికాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి - ఏపీకి కృష్ణా బోర్డు అదేశం
KRMB Meeting in Hyderabad : కృష్ణా జలాలను పొదుపుగా వాడుకోండి.. తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ సూచన