Borugadda Anil Case Updates : ఓ యూట్యూబ్ ఛానల్ నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కారణంగానే తనకు ఈ పరిస్థితి వచ్చినట్లు రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కుమార్ పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. అనంతపురం నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అతడిని మూడు రోజుల కస్టడీ సోమవారం ముగిసింది. ఈ విచారణలో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాకంపై ఆరోపణలు చేశాడని తెలుస్తోంది.
ఈ క్రమంలో సదరు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూకు ముందు సరైన ప్రశ్నావళి ఇవ్వలేదని బోరుగడ్డ అనిల్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఇంటర్వ్యూ అనంతరం తాను మాట్లాడిన అంశాలకు సంబంధించి ప్రూఫ్ రీడింగ్ చేసుకునే అవకాశం ఇవ్వకుండానే టెలికాస్ట్ చేశారని పేర్కొన్నట్లు సమాచారం. అయితే విచారణ అధికారులు మాత్రం ఈ వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు? ఏ పరిస్థితుల్లో ఎందుకు ఇలా మాట్లాడారు? అని ప్రశ్నించినట్లు తెలిసింది. చాలా ప్రశ్నలకు బోరుగడ్డ అనిల్ దాటవేత ధోరణితో సమాధానాలు చెప్పారని తెలిసింది.
వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్ కుటుంబ సభ్యులపై బోరుగడ్డ అనిల్‌కుమార్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ అధికార ప్రతినిధి సంగా తేజశ్విని ఫిర్యాదుతో నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు బోరుగడ్డను శనివారం నాడు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి అనంతపురం తీసుకువచ్చారు. అర్బన్ డీఎస్పీ శ్రీనివాసరావు, నాలుగో పట్టణ సీఐ సాయినాథ్ ఆధ్వర్యంలో అనిల్‌ను విచారించారు. సోమవారం నాడు విచారణ ముగియడంతో అతనికి ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పరీక్షలు నిర్వహించాపరు. అనంతరం రాజమహేంద్రవరం కారాగారానికి తరలించారు.