Amravati Ring Road Project: రాజధాని అభివృద్ధి ప్రణాళికల్ని గతంలో టీడీపీ ప్రభుత్వం 217 చదరపు కిలో మీటర్ల పరిధిలోని అమరావతికే పరిమితం చేయలేదు. అమరావతిని, పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు నగరాల్ని, మంగళగిరి, తాడేపల్లి వంటి పట్టణాల్ని కలిపి ఒక మహానగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందాయి. ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక 'గ్రోత్ సెంటర్'గా, అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దేందుకు, ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు వ్యూహాలు సిద్ధమయ్యాయి.
ఆ బృహత్ కార్యక్రమంలో భాగంగా తలపెట్టిందే ఓఆర్‌ఆర్. జనాభా పెరిగి, ట్రాఫిక్ రద్దీ భరించలేని స్థాయికి చేరి, దాన్ని తగ్గించేందుకు, కొత్త ప్రాంతాలకు అభివృద్ధిని విస్తరించేందుకు చాలా నగరాల్లో ఓఆర్ఆర్లు నిర్మించారు. అమరావతి ఓఆర్‌ఆర్ మాత్రం దానికి పూర్తిగా భిన్నం. అమరావతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలూ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో రాజధానికి, ఓఆర్‌ఆర్‌కు అప్పట్లోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక గ్రోత్ సెంటర్‌గా అభివృద్ధి చేసేందుకు వ్యూహరచన చేసింది.
అమరావతి ఓఆర్‌ఆర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - పలు కీలక ప్రాజెక్టులకూ ఆమోదం - Central on Amaravati ORR
2018 జనవరి నాటి ప్రతిపాదనల ప్రకారం ఓఆర్ఆర్ను ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీఆర్డీయే పరిధిలో 189 కిలో మీటర్ల పొడవున నిర్మాణం. 150 మీటర్ల వెడల్పుతో, రెండు వైపులా సర్వీస్ రోడ్లు కాకుండా, ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మిస్తారు. అప్పటి అంచనాల ప్రకారం నిర్మాణ వ్యయం 17 వేల 761.49 కోట్లుగా ఉంది. అవసరమైన భూమి 3వేల 404 హెక్టార్లు కాగా భూసేకరణ వ్యయం 4 వేల 198 కోట్లుగా ఉంది. అమరావతి ఓఆర్‌ఆర్‌కు కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ అంగీకారం తెలిపింది. ఏడోదశ రింగ్‌రోడ్ల అభివృద్ధి కింద మంజూరు చేసింది. 'అవుటర్ రింగ్ రోడ్ ఫర్ న్యూ క్యాపిటల్ సిటీ' అని ఈ ప్రాజెక్టుకు పేరు పెట్టారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల మీదుగా వెళ్లే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారులను 13 చోట్ల ఓఆర్‌ఆర్ క్రాస్ చేస్తుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో జాతీయ రహదారి-65పై కంచికచర్ల వద్ద ఓఆర్‌ఆర్ మొదలై గుంటూరు నగరం వెలుపల ఉన్న పొత్తూరు వద్ద కోల్‌కతా- చెన్నై జాతీయ రహదారి-16ను కలుస్తుంది. అక్కడి నుంచి కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పరిధిలో ఎన్‌హెచ్-65లో అక్కడి నుంచి విజయవాడ-ఏలూరు మార్గంలో పొట్టిపాడు టోల్‌ప్లాజా సమీపంలో జాతీయ రహదారి-16ను కలుస్తుంది.
ఓఆర్‌ఆర్‌లో భాగంగా రెండుచోట్ల కృష్ణానదిపై ఐకానిక్ వంతెనలు నిర్మించనున్నారు. నదికి ఎగువన గుంటూరు జిల్లాలోని అమరావతి ఆలయానికి సమీపంలోనూ, దిగువన కృష్ణాజిల్లా తోట్లవల్లూరు వద్ద ఈ వంతెనలు నిర్మించాలన్నది నాటి ప్రతిపాదన. వాటితో పాటు ఓఆర్‌ఆర్ మార్గంలో 12 ప్రధాన వంతెనలు, 51 చిన్న వంతెనలు కడతారు. ఓఆర్‌ఆర్‌కు పూర్తిగా లోపల ఉన్న, ఓఆర్‌ఆర్ వెళుతున్న మండలాలు 40 కాగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 87 గ్రామాల మీదుగా ఈ రహదారి వెళుతుంది.
ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలో కంచికచర్ల, వీరులపాడు, జి.కొండూరు, మైలవరం, ఆగిరిపల్లి, బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, తోట్లవల్లూరు కలిపి 10 మండలాల్లోని 49 గ్రామాల మీదుగా వెళ్తుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో కొల్లిపర, పొన్నూరు, తెనాలి, చేబ్రోలు, వట్టిచెరుకూరు, గుంటూరు, మేడికొండూరు, యడ్లపాడు, తాడికొండ, పెదకూరపాడు, అమరావతి మండలాల్లోని 38 గ్రామాల మీదుగా సాగుతుంది. ఓఆర్‌ఆర్ పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లోని జనాభా సుమారు 40 లక్షలు ఉంటుంది.
ఓఆర్‌ఆర్ నిర్మాణం పూర్తయితే అమరావతి కేంద్రంగా రింగ్‌రోడ్డుకు లోపలున్న ప్రాంతంతో పాటు, దానికి వెలుపల చుట్టూ కొన్ని కిలోమీటర్ల వరకు అభివృద్ధి పరుగులు పెడుతుంది. విజయవాడ, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి పక్కపక్కనే ఉన్నాయి. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కనకదుర్గ వారధి నుంచి నాగార్జున యూనివర్సిటీ వరకు జాతీయ రహదారికి ఇరుపక్కలా పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి.
ఓఆర్‌ఆర్ నిర్మాణం పూర్తయితే రాబోయే కొన్నేళ్లలోనే విజయవాడ, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు కలసి మెగా సిటీగా మారతాయి. ఓఆర్‌ఆర్‌కు వెలుపల, సమీపంలో ఉన్న చిన్నచిన్న పట్టణాలు, ముఖ్యమైన పట్టణ కేంద్రాలకు ఓఆర్‌ఆర్‌తో అనుసంధానం పెరిగి అవన్నీ ప్రత్యేక 'డెవలప్‌మెంట్ నోడ్స్'గా వృద్ధి చెందుతాయి. ఈ ప్రాంతం మీదుగా వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారుల్ని అనుసంధానిస్తూ ఓఆర్‌ఆర్ నిర్మించడం వల్ల రాష్ట్రంలోని ఇతర చోట్లకు, పొరుగు రాష్ట్రాలకు అమరావతితో అనుసంధానం పెరుగుతుంది. అమరావతికి రాకపోకలు తేలికవుతాయి.
ప్రస్తుతం అమరావతికి చేరుకోవాలంటే విజయవాడ, గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి మీదుగా వెళ్లాల్సిందే. ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి. దూరం ఎక్కువవుతుంది. ఓఆర్‌ఆర్ నిర్మిస్తే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డుమార్గంలో వచ్చేవారూ నేరుగా అమరావతి చేరుకోవచ్చు. ప్రతిపాదిత మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులు అమరావతికి చెరోవైపు ఉన్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ వంటి తీరప్రాంతం లేని రాష్ట్రాలకు ఈ పోర్టులు దగ్గరవుతాయి. ఆ రాష్ట్రాల నుంచి పోర్టులకు ఓఆర్‌ఆర్ ద్వారా వెళ్లడం తేలికవుతుంది.
అమరావతి, విజయవాడ, గుంటూరు నుంచి గన్నవరం, శంషాబాద్ విమానాశ్రయాలకు ఓఆర్‌ఆర్ నుంచి వెళ్లడం తేలిక అవుతుంది. విశాఖ-హైదరాబాద్ ట్రాఫిక్ విజయవాడకు రావాల్సిన అవసరం లేకుండా ఓఆర్‌ఆర్ మీదుగా సాగుతుంది. అమరావతి, విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్య మేజర్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఓఆర్‌ఆర్‌కు లోపల, వెలుపల ఉన్న ప్రాంతాల్లో గుంటుపల్లి, నున్న, గన్నవరం, పెదవడ్లపూడి, పెదకాకాని, పెదపరిమి ప్రాంతాల్ని అర్బన్ నోడ్స్‌గా, మైలవరం, ఆగిరిపల్లి, పెదఅవుటపల్లి, రేపల్లె, నందివెలుగు, వేజెండ్ల, పేరేచర్ల, పాత అమరావతి , కంచికచర్లను గ్రోత్ సెంటర్లుగా అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. 17 శాటిలైట్ టౌన్‌షిప్‌లు అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన ఉంది.