AMARAVATI OUTER RING ROAD PROJECT: అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన 189.4 కిలోమీటర్ల 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ ORR ఎలైన్‌మెంట్‌కు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమికంగా ఆమోదించింది. ఓఆర్‌ఆర్‌కు దగ్గరగా ప్రతిపాదిత విజయవాడ తూర్పు బైపాస్ వెళ్తుండడంతో ఆ నిర్మాణం అనవసరమని అభిప్రాయపడింది. ఓఆర్‌ఆర్‌లో 4చోట్ల స్వల్ప మార్పులు చేయాలని సూచించింది.
డ్రోన్ సర్వే ద్వారా పరిశీలన: గత నెల 20నే కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ భేటీ జరగ్గా అందులో తీసుకున్న నిర్ణయాలు తాజాగా వెల్లడయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం 189.4 కిలోమీటర్లతో ఒకే ఎలైన్‌మెంట్‌ను ప్రతిపాదించగా దీనికి కమిటీ ఆమోదం తెలిపింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ- ఎన్హెచ్ఏఐ అధికారులు ఇటీవల ఎలైన్‌మెంట్‌ను డ్రోన్ సర్వే ద్వారా పరిశీలించగా రెండుచోట్ల చేపల చెరువులు, ఓ ప్రాంతంలో గోదాములు, మరోచోట ఇటుకలతో నిర్మాణం ఉన్నట్లు గుర్తించారు.
ఇలాంటి చోట్ల ఎలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పులు చేయాలని కేంద్ర కమిటీ సూచించింది. ఈ ప్రాజెక్టుకు సివిల్‌వర్క్స్, భూసేకరణ వ్యయం కలిపి 16 వేల 310 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. నిర్మాణంలో వినియోగించే సిమెంట్, స్టీల్, బిటుమిన్ తదితరాలకు రాష్ట్ర జీఎస్టీ మినహాయింపు, కంకర, గ్రావెల్ తదితరాలకు సీనరేజ్ ఫీజు మినహాయింపు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో వాటి వ్యయం 11 వందల 56 కోట్ల మేర తగ్గుతుంది. దీంతో చివరకు 15 వేల 154 కోట్లు కేంద్రం వెచ్చించాల్సి ఉంటుంది.
దారులన్నీ అమరావతికే! - ఏడు జాతీయ రహదారులతో అనుసంధానం
70 మీటర్ల వెడల్పుతో భూసేకరణ: ఓఆర్‌ఆర్ నిర్మాణానికి 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలని రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించింది. భవిష్యత్‌లో ఓఆర్‌ఆర్ వెంబడి రైల్వేలైన్ నిర్మాణం, ఇతరత్రా వాటికి భూమి అవసరమని పేర్కొంది. 6 వరుసల రోడ్డుకి 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణ సరిపోతుందని, భవిష్యత్తులో 8 వరుసల విస్తరణకూ వీలుంటుందని కమిటీ తెలిపింది. జాతీయ రహదారుల చట్టం-1956 (National Highways Act-1956) ప్రకారం భూసేకరణ చేయనున్నందున, ఇతర అవసరాలకు ఆ భూమిని వినియోగించకూడదని పేర్కొంది. రాష్ట్రప్రభుత్వం రైల్వేశాఖతో సంప్రదించి అదనపు భూసేకరణపై దృష్టి పెట్టొచ్చని సూచించింది.
4 వరుసల బైపాస్ అక్కర్లేదు: విజయవాడకు తూర్పువైపు ప్రతిపాదించిన 4 వరుసల బైపాస్ అక్కర్లేదని కమిటీ తెలిపింది. ఇప్పటికే ఓఆర్‌ఆర్ నిర్మాణ ప్రతిపాదన ఉండడంతో, దానికి సమాంతరంగా ఉండే తూర్పు బైపాస్ నిర్మించాల్సిన పనిలేదంది. రెండింటికీ మధ్య ఎక్కువ దూరం లేదని తెలిపింది. అయితే చెన్నై-కోల్‌కతా హైవేలో కాజా వద్ద పూర్తయ్యే విజయవాడ పశ్చిమ బైపాస్‌ను ఓఆర్‌ఆర్‌తో అనుసంధానం చేయాలని పేర్కొంది. అంటే కాజా నుంచి ఓఆర్‌ఆర్‌కు 18 కిలోమీటర్ల మేర అనుసంధాన రహదారి నిర్మిస్తారు. కాజా కూడలి వద్ద ఫ్లవర్‌లీఫ్ ఇంటర్‌ఛేంజ్‌ను నిర్మించాలని కమిటీ సూచించింది.
ఎక్కడా సర్వీస్ రోడ్లు నిర్మించట్లేదు: ఓఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్‌కు 500 మీటర్ల పరిధిలో భూ వినియోగ మార్పిడి, భూముల క్రయవిక్రయాలను స్తంభింపజేయాలని కమిటీ రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. లేకపోతే భూసేకరణ వ్యయం పెరిగిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించగా దీనిపైనా ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీలో చర్చించారు. ఓఆర్‌ఆర్‌ల నిర్మాణంలో ఎక్కడా సర్వీస్ రోడ్లు నిర్మించట్లేదని, అయితే రింగ్‌రోడ్‌కు లోపలివైపు మాత్రమే సర్వీస్ రోడ్ల నిర్మాణానికి పరిశీలించాలని కమిటీ సూచించింది.
ఆంధ్రప్రదేశ్ వెలుగు రేఖ, రాజధాని అమరావతి మీ ఊరుకు ఎంత దూరమంటే? - AMARAVATI OUTER RING ROAD