Amaravati Farmers Fire on AP CRDA Officers : నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి నిర్మాణ కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం సీఆర్డీఏ ను ఏర్పాటు చేసింది. ప్రత్యేక చట్టం ద్వారా సీఆర్డీఏను ఏర్పాటు చేసి దాని ద్వారానే రైతుల నుంచి భూ సమీకరణ చేపట్టారు. రాజధాని గ్రామాల్లో సీఆర్డీఏ తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేసి మరీ అప్పట్లో సమీకరణ ప్రక్రియ పూర్తి చేశారు. టీడీపీ హయాంలో రాజధానిలో చాలా వరకు నిర్మాణాలు జరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిని ఆపేసింది. మూడు రాజధానుల పేరుతో నాటకానికి తెరలేపారు. అలాంటి సమయంలో సీఆర్డీఏ కూడా రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెట్టింది.
భూములు ఇచ్చిన రైతుల హక్కులు కాపాడటంలో గానీ వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించటంలో గానీ మస్యలు పరిష్కరించటంలో గానీ సీఆర్డీఏ ఎలాంటి చొరవ చూపలేదు. రైతులకు ఏటా ఇవ్వాల్సిన వార్షిక కౌళ్ల విషయంలోనూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. కౌలు డబ్బుల కోసం రైతులు ప్రతిసారి కోర్టుకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. వైఎస్సార్సీపీ నేతలు రాజధానిలో రోడ్లు తవ్వుకుపోతున్నా, రైతులకు కేటాయించిన ప్లాట్లలో మట్టిని తీసుకెళ్తున్నా పట్టించుకోలేదు. అమరావతిలో వివిధ రకాల భవనాల కోసం తెచ్చిన నిర్మాణ సామగ్రి చోరుల పాలవుతున్నా స్పందించలేదు. రైతుల నుంచి విమర్శలు వచ్చిన తర్వాత ఒకటి రెండుసార్లు ఫిర్యాదులు చేసింది. పోలీసులు తూతూ మంత్రంగా కేసులు పెట్టి ఒకరిద్దరు చిల్లర దొంగల్ని తెచ్చి అరెస్టు చూపించారు. అసలు దొంగల్ని వదిలేశారు.
ప్రధాని మోదీ అమరావతికి శంకుస్థాపన చేసిన స్థలంలో త్రీడి నమూనాలను ధ్వంసం చేసినా చర్యలు లేవు. అక్కడ కాపలా కూడా ఏర్పాటు చేయలేదు. రాజధానిలో వేయాల్సిన భారీ తాగునీటి పైపులను అనుమతి లేకుండానే గుత్తేదారు సంస్థలు తీసుకెళ్లాయి. వారం రోజుల క్రితం జరిగిన ఈ తరలింపుపై మీడియాలో ప్రముఖంగా వచ్చినా సీఆర్డీఏ స్పందించలేదు. అమరావతికి వ్యతిరేకంగా సీఎం జగన్ వ్యవహరిస్తుండటంతో సీఆర్డీఏ అధికారులూ ఇందుకు తగ్గట్లే నడుచుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు మినహా మిగిలిన వాటిని పూర్తిగా గాలికొదిలేశారు.
అయితే రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నాయనే విషయం సీఆర్డీఏ అధికారులకు అవగతమైనట్లుంది. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనుండటం కూటమి అధికారంలోకి వస్తుందన్న చర్చ సాగుతుండటంతో ఇప్పుడు వారికి విధులు గుర్తొచ్చాయి. ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన పాడైపోయిన ప్లాస్టిక్ విషయంలో సీఆర్డీఏ అధికారులు వేగంగా స్పందించారు. అమరావతిలో భూగర్భ కేబుళ్లకు అమర్చే ప్లాస్టిక్ స్పేసర్లను ఎల్ అండ్ టీ సంస్థ రాజధానిలోని మందడంలో నిల్వ చేసింది.
రాజధాని అమరావతిలో వింతైన చోరీ - కొద్ది కొద్దిగా కొల్లగొడుతున్నదొంగలు
ఐదేళ్లుగా పక్కన పడి పాడైపోవటంతో వాటిని తుక్కు కింద అమ్మింది. పాత తుక్కు కంటైనర్లలో తరలిస్తున్న విషయం మీడియాలో రావటంతో సీఆర్డీఏ అధికారులు తమ సహజశైలికి భిన్నంగా స్పందించారు. ఎల్ అండ్ టీ సంస్థ అధికారులతో మాట్లాడి కంటైనర్ ను వెనక్కి తెప్పించారు. సీఆర్డీఏతో చేసుకున్న ఒప్పందాన్ని ఎల్ అండ్ టీ ఉల్లంఘించినట్లు తేల్చారు. ఇక్కడ పనులు పూర్తి కాలేదు కాబట్టి సామగ్రి అంతా గుత్తేదారు అజమాయిషీలోనే ఉండాలి. సీఆర్డీఏకు చెప్పకుండా సామగ్రిని తరలించకూడదు. అందుకే కంటెయినర్లను వెనక్కి రప్పించారు. సీఆర్డీఏలో ఇప్పటి వరకు అధికార వైఎస్సార్సీపీతో అంటకాగిన అధికారులు ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళనలో ఉన్నారు. అందుకే ఆఘమేఘాల మీద స్పందించారు. కూటమి అధికారం చేపడితే అమరావతికి ప్రాధాన్యం ఇస్తారనే సంకేతాలతో సీఆర్డీఏ అధికారులు వెంటనే స్పందించినట్లు తెలిసింది. అవసరమైన సమయాల్లో మాత్రం చీమ కుట్టినట్లు కూడా వ్యవహరించకపోవటంతో అమరావతిలో భారీగా ప్రజాధనం వృథా అయింది. రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన తమకు కన్నీళ్లే మిగిలాయని రైతులు ఆవేదనగా చెబుతున్నారు. ఈ పాపంలో సీఆర్డీఏ అధికారుల పాత్ర కూడా ఉందని ఆరోపిస్తున్నారు.
అధికారులు చట్ట ప్రకారం పని చేయకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేందుకు అమరావతే ప్రత్యక్ష ఉదాహరణ. భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లింపు విషయంలో సీఆర్డీఏ పెట్టిన ఇబ్బందులు మామూలుగా లేపు. టీడీపీ హయాంలో సక్రమంగా కౌలు పొందిన రైతులను సైతం రకరకాల కాగితాలు కావాలని వేధించారు. అవి తెచ్చి ఇచ్చిన తర్వాత కూడా కౌలు చెల్లించకుండా నిధుల లేవనే సాకుతో ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు అధికారుల వైఖరిలో మార్పు రావటం మంచిదే అయినా చాలా వరకూ నష్టం జరిగిందని రాజధాని రైతుల ఆవేదన.