Amaravathi VIT University Students Designed E Bike : కాలుష్యం బారి నుంచి పర్యావరణాన్ని రక్షించాలి, సమాజానికి అధునాతన ఆవిష్కరణలు అందించాలనే ధ్యేయంతో పనిచేస్తున్నారు VIT అమరావతి యూనివర్సిటీ విద్యార్థులు. బ్యాటరీ పేలుళ్లకు భయపడి ఈ-వాహనాలను వాడకం పక్కన పెట్టేయాలనే ఆలోచన నుంచి ప్రజలను బయటపడేసేందుకు ప్రయాణ స్టార్టప్ స్థాపించి సరికొత్త ఈ-బైక్ రూపొందించారు.
సరికొత్త ఈ-బైక్‌తో స్టార్టప్ : ఈ-వాహనాల వినియోగదారులు పడుతున్న ఇబ్బందులు పరిష్కరించాలని భావించింది VIT అమరావతి విశ్వవిద్యాలయం బృందం. ఇంక్యుబేషన్ సెంటర్ హెడ్ సుధా ఎలిసన్ ఆధ్వర్యంలో ECE విద్యార్థి మరియా కిరణ్, CSE విద్యార్థిని తేజస్విని, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అశోక్ కలిసి ప్రయాణ స్టార్టప్ ఏర్పాటు చేశారు. అత్యాధునిక ప్రయాణ అనుభవాన్ని తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతో రెండు ఏళ్ల క్రితం ఈ-బైక్ తయారీకి శ్రీకారం చుట్టారు. అధిక ధర వల్ల ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు దూరంగా ఉండిపోతున్నారు సామాన్యులు. అందుకే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈ-బైక్‌లో సగం ధరకే ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రయాణ స్టార్టప్ బృందం. ఈ అంకురాన్ని స్థాపించిన ప్రొఫెసర్ ఎలిసన్ సారథ్యంలో ఎలక్ట్రిక్ బైక్ తయారుచేసింది.
"బ్యాటరీ పేలుడు సమస్య తలెత్తకుండా ఉండేందుకు స్మార్ట్ BMS విత్ AI సాంకేతికత వాడి ఈ-బైక్ తయారుచేశాం. రోడ్లపై గుంతలు ఉన్నా, ఎవరైనా బైకును దొంగలించేందుకు ప్రయత్నించిన వెంటనే యజమానికి మెుబైల్ ద్వారా సందేశాన్ని ఇస్తుంది. అలాగే ఏ ప్రాంతానికైనా వెళ్లాలంటే ముందుగానే దానికి సంబంధించి మ్యాప్‌ను రెడీ చేసిపెట్టుకుంటుంది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికి ఉపయోగపడే విధంగా తయారుచేస్తున్నాం." - ఎలిసన్, విట్ అధ్యాపకులు, ప్రయాణ స్టార్టప్ సీఈవో
"మెుబైల్ యాప్ సాయంతో పనిచేసే ఈ ఎలక్ట్రికల్ బైక్ దొంగతనం సమస్యకు చెక్ పెడుతుంది. జియో ఫెన్సింగ్ వల్ల ఎప్పటికప్పుడు వినియోగదారుల్ని అప్రమత్తం చేసేలా శ్రద్ధ తీసుకుంటుంది. 52 నుంచి 60 వేల రూపాయలోపే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ-బైకులు మార్కెట్లో తెచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తున్నాం. బేసిక్ మోడల్ గంటకు 60 నుంచి 65 కిలోమీటర్ల మైలేజ్ వస్తోంది. ఇది 2 నుంచి 3 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది." - తేజస్విని, విద్యార్థిని, ప్రయాణ స్టార్టప్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్
సరికొత్త ప్రయాణ అనుభవం : మార్కెట్లో ఉన్న, వినియోగదారుల ఇబ్బందులకు పరిష్కారంగా తెచ్చిన ప్రయాణ ఎలక్ట్రికల్ బైక్ పేరుకు తగ్గినట్లే సరికొత్త ప్రయాణ అనుభవాన్ని అందిస్తోందని విట్ విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండు ఏళ్లు కష్టపడి అత్యాధునిక ప్రయాణ అనుభవాన్ని వినియోగదారుడికి అందించేలా దీనిని మలిచినట్లు ప్రయాణ బృంద సభ్యులు స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా ఈ-బైక్ కొనుగోలు చేద్దామనుకునే వారిని భయపెడుతున్న బ్యాటరీ పేలుడు సమస్యకు పూర్తి భరోసాను ఈ ప్రయాణ ఎలక్ట్రికల్ వాహనం అందిస్తోందని హామీ ఇస్తున్నారు. బ్యాటరీ ఉష్టోగ్రతను నియంత్రించేలా స్మార్ట్ బీఎమ్ ఎస్ సాంకేతికతను వినియోగించినట్లు విద్యార్థులు చెబుతున్నారు.
ఇటీవల విజయవాడ హ్యాకథాన్‌లో ఈ వాహనాన్ని ప్రదర్శించి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నుంచి అభినందనలు అందుకుంది ప్రయాణ బృందం. అందుబాటు ధరలో, ఎక్కువ మైలేజీతో ప్రయాణ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ప్రయాణ రూపకర్తలు. వినియోగదారుల్ని ఆకర్షించేందుకు అద్దె విధానాన్ని సైతం తీసుకొస్తామని అంటున్నారు.
13ఏళ్లలో 19వేలకుపైగా పాములు- వాటి కోసమే ఆ యువకుడి పోరాటం - Kranthi of Jangareddygudem