AP Alur MLA Virupakshi Brother Attacked on Electric Substation : స్థానిక ఎమ్మెల్యే అంటే భయం లేదా? ఆయన్ను కలవకుండా మీ ఇష్టారాజ్యంగా వ్యాపారాలు చేసుకుంటూ పోతే ఎలా? అంటూ ఆంధ్రప్రదేశ్‌లోని ఆలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు, అనుచురులు రెచ్చిపోయారు. కర్నూలు జిల్లా ఆలూరు, దేవనకొండ, ఆస్పరి మండలాల్లో పవన విద్యుత్తు సంస్థల కార్యాలయాల్లోకి వెళ్లి దౌర్జన్యం చేశారు. ఫర్నీచర్, అద్దాలను పగులకొట్టి అక్కడ పని చేస్తున్న వారిని భయభ్రాంతులకు గురిచేశారు. బాధిత సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆలూరు మండలంలోని మొగలవల్లి గ్రామ సమీపంలో సీమన్స్ గమేషా కంపెనీకి చెందిన పవన విద్యుత్తు ఉపకేంద్రానికి ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులు 10 వాహనాల్లో 50 మంది వరకూ వచ్చారు. అక్కడి సెక్యూరిటీ గార్డు సెల్‌ఫోన్‌ను లాక్కొని లోపలికి వచ్చారు. అందరూ బయటకు వెళ్లిపోవాలని గట్టిగా అరిచారు. ఈ క్రమంలో అద్దాలను పగులగొట్టి, ఫర్నీచర్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇష్టారాజ్యంగా వ్యాపారాలు చేసుకుంటూ పోతారా అంటూ బెదిరింపులకు దిగారు.
పూర్తి ఫర్నీచర్ ధ్వంసం : అందరినీ బయటకు పంపించేసి గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు. బాధిత సిబ్బంది ఈ విషయాన్ని గుంతకల్లు ఎమ్మెల్యే జయరాం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జయరాం సోదరుడు శ్రీనివాసులు, మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ నారాయణ అక్కడికి వచ్చి, గేటుకు వేసిన తాళం పగులగొట్టి సిబ్బందిని తిరిగి ఉప కేంద్రంలోకి పంపించారు.
ఏపీలోని దేవనకొండ మండలం మాదాపురం సమీపంలోని మరో ప్రైవేటు పవన విద్యుత్తు కంపెనీ కార్యాలయంపైనా విరూపాక్షి అనుచరులు దాడి చేశారు. అక్కడ సామగ్రిని కూడా ధ్వంసం చేశారు. ఆస్పరి మండలం జొహరాపురం గ్రామంలోని మరో సంస్థ కార్యాలయంలోని ఫర్నీచర్‌ను సైతం బయటపడేశారు. మూడు చోట్లా దౌర్జన్యానికి పాల్పడిన 24 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమది అసలే వెనుకబడిన ప్రాంతమని, ఇలా దౌర్జన్యాలను పాల్పడితే ఉపాధినిచ్చే సంస్థలు మూతపడతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.