Bail to Allu Arjun : హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినిమాను మించి మలుపులు చోటు చేసుకున్నాయి. ఉదయం అరెస్టైన అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తొలుత అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి చిక్కడపల్లి స్టేషన్‌కు తరలించిన పోలీసులు వాంగ్మూలం నమోదు చేసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించగా 14 రోజుల రిమాండ్ విధించింది. భారీ బందోబస్తు మధ్య చంచల్‌గూడ జైలుకు తరలించారు. అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ అరెస్టు తదితర అంశాలపై ఉదయం నుంచి అనూహ్య పరిణామాలు జరిగాయి. ఈనెల 4న పుష్ప-2 చిత్ర ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హీరో అల్లు అర్జున్‌ను సైతం నిందితుడిగా చేర్చిన పోలీసులు BNS 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మధ్యాహ్నం అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇదే సమయంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై వాదనలు జరిగగా న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ అల్లు అర్జున్‌కు ఊరట కల్పించింది. అంతకు ముందు అల్లు అర్జున్ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు జరిగాయి.
నిన్న దిల్లీలో పుష్ప-2 సినిమా సక్సెస్ మీట్ ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చిన అల్లు అర్జున్ ఇంటికి మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీసులు వచ్చారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా బన్నీ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆయన వెంట తండ్రి అల్లు అరవింద్ కూడా వెళ్లారు.
అక్కడ ప్రత్యక్ష సాక్షి స్టేట్‌మెంట‌్ ఆధారంగా సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ నేతృత్వంలో దాదాపు 2 గంటల పాటు విచారించారు. వాంగ్మూలం రికార్డు చేశారు. అదే సమయంలో అల్లు అరవింద్ ఇంటికి మెగా స్టార్ చిరంజీవి దంపతులు, అభిమానులు చేరుకున్నారు. చిక్కడపల్లి స్టేషన్‌లో వాంగ్మూలం నమోదు చేసిన అనంతరం అల్లు అర్జున్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కోవిడ్‌తో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, రోగుల సహాయకులు ఎగబడ్డారు. నివేదికలు సాధారణంగా ఉండటంతో నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు హాల్‌లో జనం ఎక్కువగా ఉండడంతో జడ్జి ఛాంబర్‌కు తరలించారు. ఇదే సమయంలో పలువురు సినీ ప్రముఖులు, అల్లు అర్జున్ సన్నిహితులు పుష్ప సినిమా నిర్మాతలు నాంపల్లి కోర్టు వద్దకు చేరుకున్నారు. ముందస్తుగా కోర్టు రహదారిని పూర్తిగా మూసి వేసిన పోలీసులు కోర్టు బయటా, లోపల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - పోలీసుల అదుపులో అల్లు అర్జున్ - ALLU ARJUN IN POLICE CUSTODY