Alliance leaders met CS Jawahar Reddy: పెన్షన్ల పంపిణీ వ్యవహారంపై సీఎస్ జవహర్ రెడ్డి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఎన్డీఏ కూటమి నేతలు సచివాలయంలో ఆకస్మిక ధర్నాకు దిగారు. సీఎం, సీఎస్ కార్యాలయాలు ఉండే మొదటి బ్లాక్ వద్ద మెట్లపై బైఠాయించి ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి జగన్ కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
పెన్షన్ల పంపిణీ వ్యవహారంపై సీఎస్ కు ఎన్నికల సంఘం లేఖ రాసిన నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సీఎస్ ను సచివాలయంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. మే నెల పెన్షన్ ను ఇంటింటికీ పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాల్సిందిగా కోరారు. పెన్షన్ పంపిణీపై సహేతుకమైన నిర్ణయం తీసుకోవాలని, ఈసీ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. వృద్ధులను.. ఫించన్ దారులను ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎస్ జవహర్ రెడ్డికి విన్నవించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు సహ ఇతర ప్రభుత్వ ఉద్యోగులను కూడా పెన్షన్ల పంపిణీకి వినియోగించాలని సూచించారు. దీనిపై సీఎస్ నుంచి స్పష్టమైన హామీ రాకపోవటంతో కూటమి నేతలు అక్కడిక్కడే బైఠాయించి సీఎస్ జవహర్ రెడ్డి వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో 33 మంది చనిపోయారు - ఈసీకి చంద్రబాబు లేఖ - Chandrababu writes to EC
పెన్షన్ పంపిణీకి ఉద్యోగులను వినియోగించలేరా?: ప్రభుత్వ ఉన్నతాధికారులు పొరపాటు, నిర్లక్ష్యం, దురుద్దేశం వల్ల 33 మంది వృద్ధులు పెన్షన్ కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయారని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయుల్ని మద్యం దుకాణాల వద్ద పెట్టిన ప్రభుత్వం పెన్షన్ పంపిణీకి ఉద్యోగులను వినియోగించలేరా అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చినా సీఎస్ ఎందుకు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పింఛన్ పంపిణీ విషయంలో నిర్లక్ష్యం వల్ల పెన్షనర్లకు ఏమైనా జరిగితే దానికి బాధ్యత సీఎం జగన్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి తీసుకోవాలని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు.
33 మంది పెన్షనర్లు మరణించారు: పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో సీఎస్ జవహర్ రెడ్డి ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్నారని, జనసేన పార్టీ ఆరోపించింది. ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఆయన దానికి వ్యతిరేకంగా ఈసీకి లేఖలు రాయటం ఏమిటని ప్రశ్నించింది. మే నెలలో ఇంటింటికీ పెన్షన్ పంపిణీ చేయాల్సిందేనని ఆ పార్టీ నేత శివశంకర్ స్పష్టం చేశారు. గడచిన నెలలో ప్రభుత్వ ఉన్నతాధికారుల నిర్వాకం కారణంగా 33 మంది పెన్షనర్లు మరణించారని దీనికి అధికారులే బాధ్యత వహించాలని అన్నారు.
జవహర్ రెడ్డి నోరు మెదపటం లేదు: 1.27 వేల లక్షల మంది సచివాలయ సిబ్బంది, ఇతర ఉద్యోగులు ఉన్నా పెన్షన్ పంపిణీకి ఎందుకు వినియోగించటం లేదని బీజేపీ ఆక్షేపించింది. ఇక ఒక్క పెన్షనర్ చనిపోయినా, దానికి బాధ్యత సీఎస్ జవహర్ రెడ్డి తీసుకోవాలని ఆ పార్టీ నేతలు సూర్యనారాయణరాజు, లంకాదినకర్ హెచ్చరించారు. ఇంటింటికీ పెన్షన్ ఇవ్వమని అడిగితే దానికి సీఎస్ జవహర్ రెడ్డి నోరు మెదపటం లేదని ఆరోపించారు.