Alliance Govt Focused on Industrial Development: పారిశ్రామిక అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుండటంతో రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు యత్నిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడిన పారిశ్రామిక వేత్తలకు నేడు సాదర స్వాగతం పలుకుతోంది. ఇప్పటికే ఉన్న పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టింది.
రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తున్న ఆ శాఖ మంత్రి టీజీ భరత్ క్షేత్రస్థాయిలో పారిశ్రామిక వాడలను పరిశీలించి మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తున్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితతో కలిసి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్‌ను పరిశీలించారు. అనంతరం నీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ఏపీఐఐసీ అధికారులతో చర్చించారు. అనంతరం జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీని సందర్శించి పరిశ్రమ యాజమాన్యం, ఏపీఐఐసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిన పరిశ్రమలు మళ్లీ చంద్రబాబు సీఎం అవ్వడంతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని భరత్ తెలిపారు. ఐదు సంవత్సరాల వైఎస్సార్సీపీ పాలనలో విధ్వంసం తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధే మంత్రంగా ముందుకు సాగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావడంతో ఇప్పుడున్న ఫ్యాక్టీరీని మరింత విస్తరించేందుకు ముందుకొస్తోందని తెలిపారు. ప్రభుత్వం తరపున ఫ్యాక్టరీకి అందించాల్సిన విద్యుత్, వాటర్, రైల్వే సైడింగ్స్ ఇతర మౌలిక సదుపాయాలను గత ప్రభుత్వం చేయలేదన్నారు. పారిశ్రామిక వేత్తలందరితో చర్చలు జరుపుతున్నామని వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వారందరూ ఆసక్తిగా ఉన్నట్లు మంత్రి టీజీ భరత్ చెప్పారు.
చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు వస్తున్నాయి. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిశ్రమలను పట్టించుకోకపోవడంతో ఉన్న కంపెనీలు తరలిపోయాయి. ప్రస్తుతం పరిశ్రమలు వచ్చినా యువతకు ఉపాధి కలగాలంటే తగిన నైపుణ్యాలు ఉండాలి. అప్పుడే నిరుద్యోగుల సంఖ్య తగ్గుతుంది. పారిశ్రామిక వేత్తలకు మా ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని వారికి భరోసా ఇస్తున్నాం. - టీజీ భరత్, పరిశ్రమల శాఖ మంత్రి
కేంద్ర ప్రభుత్వం సైతం ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు 1800 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు టీజీ భరత్ తెలిపారు. శ్రీసిటీ గ్రీన్ జోన్‌లో ఉందని, ఓర్వకల్లు రెడ్ జోన్‌లో ఉండటంతో ఎలాంటి పరిశ్రమలైనా ఇక్కడ ఏర్పాటు చేయొచ్చన్నారు. ఓర్వకల్లులో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తే పరిశ్రమలు భారీగా ఏర్పాటయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా బెస్ట్ కన్సల్టెన్సీతో మాట్లాడి ఇండస్ట్రియల్ జోన్లో సమస్యలేమైనా ఉంటే గుర్తించి సరి చేసుకుంటామన్నారు.
'నైపుణ్య గణనకు ఏర్పాట్లు చేయండి' - అధికారులకు మంత్రి లోకేశ్ ఆదేశం - Minister Lokesh on Skill Census