Minister Tummala Review On Peddavagu Project Breach : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఇటీవల భారీ వర్షాలకు గండిపడ్డ పెద్దవాగు ప్రాజెక్టును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు (ఆదివారం) పరిశీలించారు. పెదవాగు ఆనకట్టకు పడిన గండి, దానివల్ల తలెత్తిన పరిణామాలపై అధికారులను ఆరా తీశారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టడంపై ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు.
పెద్దవాగు ప్రాజెక్ట్‌కు గండి పడటానికి కారణాలను అన్వేషించాలంటూ మంత్రి తుమ్మల అధికారులను అదేశించారు. సమస్యను పరిష్కరించే మార్గం కనుక్కోవాలని సూచించారు. ప్రాజెక్ట్‌కు గండి పడటం ద్వారా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రాజెక్టును పరిశీలించిన ఆయన, గతంలో కూడా ఇదే చోట కట్ట తెగిందని గండిపడిన సమయంలో అధికారులు తనకు సమాచారం ఇచ్చారని తెలిపారు.
గండిపడిన విషయం తెలిసిన వెంటనే కలెక్టర్‌తో పాటుగా ఎస్పీని అప్రమత్తం చేసినట్లు మంత్రి వెల్లడించారు. వరద ఎక్కువ అవుతుందేమోనని కట్టవద్ద గోనె సంచులు ఏర్పాటు చేయాలంటూ అధికారులకు చెప్పినట్టు తెలిపారు. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టుకు గండి పడిందని రైతులు మంత్రి ముందు వాపోయారు. తద్వారా వ్యవసాయానికి తీవ్ర నష్టం జరిగిందని ఫిర్యాదు చేశారు.
ప్రాజెక్ట్‌పై అధికారులతో చర్చించాక, పూర్తి పరిశీలన చేసి నిర్లక్ష్యం ఎవరిది? సమస్యకు పరిష్కారం మార్గాలు చెబుతానంటూ మంత్రి తెలిపారు. అయితే, రైతులు మాత్రం కేవలం అధికారుల నిర్లక్ష్యమే ఇంతటి వినాశనానికి దారితీసిందని ఆరోపించారు. ప్రాజెక్టు 35 నుంచి 40 వేల క్యూసెక్కుల వరద సామర్థ్యం ఉంటుందని అధికారులు అన్నారని కానీ, 80 వేల క్యూసెక్కుల నీరు చేరినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని అందువల్లే ప్రాజెక్టుకు గండి పడిందని రైతులు తెలిపారు.
మరమ్మతుల కోసం గతంలో రెండు కోట్ల రూపాయల నిధులతో కేటాయించినట్టు సమాచారం ఉందని, అసలు మరమ్మతులు ఎక్కడ చేశారు? ఆ మరమ్మతులకు ఎంత ఖర్చు అయిందో చెప్పాలంటూ రైతులు డిమాండ్ చేశారు. తమకు పరిహారం ఇవ్వడం కాదు, ఈ ప్రాజెక్టు పునర్నిర్మాణం చేయకపోతే తమ జీవితాలే ప్రశ్నార్ధకం అంటూ తుమ్మల ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్దవాగు ప్రాజెక్ట్ గండి పడి నీట మునిగిన ఇళ్లను మంత్రి పరిశీలించారు. వరదల్లో ఇళ్లు కొట్టుకుపోయిన వారికి అత్యవసర సాయాన్ని అందచేయాలని కలెక్టర్క ఆదేశాలు జారీ చేశారు. 42 ఇళ్లు కొట్టుకుపోయాయంటూ అధికారులు తెలిపారు. ఇళ్లు కోల్పోయిన బాధితులు మంత్రికి తమ గోడు వినిపించుకున్నారు. ప్రాజెక్టు బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామంటూ తుమ్మల హామీ ఇచ్చారు.
మా రోడ్డెక్కడో పోయింది? - వర్షాలతో కొట్టుకుపోయిన రహదారులు - RAIN DAMAGE ROADS IN BHUPALPALLY