Adikavi Nannaya University Students Strike due to Food Issue : రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ వసతి గృహాల్లో విద్యార్థినులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఆహార పదార్థాల్లో నాణ్యతలేమి, సరైన పరిశుభ్రత పాటించకపోవడంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామంటూ వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థినులు ఆందోళనకు దిగారు. అన్నంలో పురుగులు ఉంటున్నాయని, కూరగాయలు సరిగా శుభ్రం చేయకుండా వండుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా డైనింగ్ హాల్ మొత్తం అధ్వానంగా ఉంటోందని వాపోయారు.
మన పిల్లలకైతే ఇలాగే పెడతామా : ఈ సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వంటమనిషి, కొందరు సిబ్బంది దారుణంగా వ్యవహరిస్తున్నారని గళమెత్తారు. విద్యార్థుల సమస్యను తెలుసుకున్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. పురుగులతో ఉన్న అన్నం, మాడిపోయిన కూరలు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన పిల్లలకైతే ఇలాగే పెడతామా అంటూ అధికారులపై మండిపడ్డారు. ఇక ముందు ఇలాంటి పరిస్థితి తలెత్తితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రత్యేక కమిటీ వేసి, పది రోజుల్లో సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
పాఠశాల మైదానంలో నిర్మాణాలు- క్రీడాకారులు, అఖిలపక్షం ఆందోళన
పారబోస్తున్నదే ఎక్కువ : యూనివర్సిటీలో విద్యార్థినుల వసతి గృహంలో 650 మంది, విద్యార్థుల హాస్టల్‌లో 475 మంది ఉంటున్నారు. విద్యార్థినుల వసతి గృహంలో రోజూ వండే ఆహార పదార్థాల్లో విద్యార్థులు తినేదానికంటే చెత్త డబ్బాల్లో పారబోస్తున్నదే ఎక్కువగా ఉంటోంది. నాసిరకం ఆహారం తినలేక అర్ధాకలితో ఉంటున్నామని చాలా మంది విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు. అదేవిధంగా తాగు, వాడుక నీటితో సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. వండే ఆకుకూరల్లో గడ్డి, మట్టి ఉంటున్నాయన్నారు. వీటిపై ప్రశ్నిస్తే తిరిగి మమ్మల్నే దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వసతి గృహంలో చేరినప్పుడు నెలకు రూ.2 వేలు అని చెప్పారని, ఇప్పుడు అదనంగా రూ.800 వరకు వసూలు చేస్తున్నారని విద్యార్థులు వాపోయారు.
"వసతి గృహంలో విద్యార్థుల ఇబ్బందులను పరిష్కరించేందుకు సలహా సంఘ సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నాం. త్వరలోనే సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం." - వై.శ్రీనివాసరావు, ఉపకులపతి, నన్నయ విశ్వవిద్యాలయం
విద్యావ్యవస్థపై వైసీపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం - సీఎం జగన్ కడప పర్యటనపై ఫైర్