Actions Against Anantapur AR Additional SP and Special Branch CI: పది సంవత్సరాలుగా అనంతపురంలోనే ఉంటూ అధికారపార్టీ నాయకులతో కలిసిపోయి వారు చెప్పిందల్లా చేస్తూ సొంత పోలీసులనే తప్పుదోవ పట్టించిన సీఐ జాకీర్ హుస్సేన్‌పై ఎస్పీ గౌతమి సాలి వేటు వేశారు. డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేశారు. ఎన్నికల విధుల్లో జాకీర్ హుస్సేన్ బాధ్యతారహితాన్ని డీఐజీ, డీజీపీ కార్యాలయానికి పూసగుచ్చినట్లు నివేదించిన ఎస్పీ అతను జిల్లాలో పనిచేయడానికి అర్హుడు కాదని చెప్పినట్లు సమాచారం. పోలింగ్ రోజున తాడిపత్రిలో జరిగిన రాళ్లదాడిని తొక్కిపట్టేలా వ్యవహరించిన తీరు తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ ఘటనపై అనంతపురం ఎస్పీ అమిత్ బర్దార్‌పై ఈసీ చర్యలు తీసుకుంది. జాకీర్ హుస్సేన్ గతంలో పనిచేసిన పోలీస్ స్టేషన్లలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధికి అనుకూలంగా వ్యవహరించిన తీరుపై ఎస్పీ రహస్య విచారణ జరిపించారు. తర్వాత డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శనివారం అర్ధరాత్రి విజయవాడకు వెళ్లిన స్పెషల్ బ్రాంచి సీఐ జాకీర్ హుస్సేన్ డీజీపీ కార్యాయంలో రిపోర్టు చేసినట్లు సమాచారం.
జిల్లా ఎస్పీకి కళ్లు, చెవుల్లా పనిచేయాల్సిన స్పెషల్ బ్రాంచ్ విభాగం బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసిన వైనాన్ని ఎస్పీ గౌతమీ సాలి లోతుగా పరిశీలించారు. ఇదే క్రమంలో గతంలో అనంతపురంలో పనిచేసిన పోలీస్ స్టేషన్లలో సీఐ జాకీర్ హుస్సేన్ కొంతమంది వ్యక్తులపై అక్రమ కేసులు పెట్టిన వివరాలు తెప్పించుకున్నారు. ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో పనిచేస్తూ అక్రమ కేసులు పెట్టటంపై కర్ణాటకకు చెందిన ఆర్యవైశ్యులైన వృద్ధులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదంలో చర్యలు- ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు - Two Constables Suspended
తాడిపత్రి అల్లర్ల వేళ అదనపు బలగాలు కావాలని అప్పటి ఎస్పీ కోరినా తగినన్ని లేవంటూ బాధ్యతారహితంగా వ్యవహరించిన ఏఆర్ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిపైనా వేటు పడింది. అదనపు బలగాలు పంపనందుకే అల్లర్లు పెరిగినట్లు అప్పటి ఎస్పీ అమిత్ బర్దర్ నివేదించారు. అమిత్ బర్దర్‌పై వేటు వేసిన తర్వాత ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గౌతమి సాలి తాడిపత్రి వైఫల్యాలను లోతుగా పరిశీలిస్తున్నారు. ఏఆర్ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిని పిలిచి వివరాలు కోరగా పొంతనలేని జవాబులు చెప్పినట్లు సమాచారం. లక్ష్మీనారాయణరెడ్డి తీరుపై ఎస్పీ గౌతమి సాలి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు డీఐజీ చర్యలు తీసుకున్నారు.