Cheating in The Name Of Pilgrimages : తక్కువ ధరతో కూడిన ప్యాకేజీలతో తీర్థ యాత్రలకు తీసుకెళ్తామంటూ నమ్మించాడు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్షల్లో నగదు వసూలు చేశాడు. చివరకు వందల మందికి టోకరా పెట్టాడు ఉప్పల్‌లోని ఓ నిర్వాహకుడు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం ఉప్పల్‌లోని హైకోర్టు కాలనీలో ఉండే భరత్ కుమార్ శర్మ (45) గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్‌ను నడిపిస్తున్నాడు. పలు భక్తి ఛానళ్లలో తక్కువ ప్యాకేజీలో మానస సరోవర్, ఇతర యాత్రలకు తీసుకెళ్తామని ప్రకటనలు ఇచ్చారు. దీనిని చూసి ప్రజలు నమ్మేసి నగరంతో పాటు, రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నగదు ఇచ్చి ముందుగా బుకింగ్ చేసుకున్నారు.
వందల మందికి టోకరా : తీర్థ యాత్రలకు ఆసక్తి చూపిన వారిలో అందరూ వయోవృద్ధులే కావడం గమనార్హం. వీరంతా అప్పుడప్పుడు దాచుకున్న నగదు, పింఛన్ సొమ్మును అతడికి చెల్లించారు. ఒక్కొక్కరి నుంచి రూ.2 నుంచి రూ.4 లక్షల వరకు నిందితుడు భరత్ తీసుకున్నాడు. ఇలా వందల మంది నుంచి రూ.కోట్లలో వసూలు చేశాడు. ఏళ్లు గడుస్తున్నా ఒక్కరినీ కూడా తీర్థయాత్రలకు తీసుకెళ్లకుండా రకరకాల కారణాలు చెపుతూ కాలయాపన చేస్తూ వస్తున్నాడు.
వీరిలో కొందరికి ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయి. వాళ్లను నమ్మించేందుకు నిత్యం వీడియోలు చేసి వాట్సప్‌లో పంపించేవాడు. తను ఉప్పల్‌లోనే ఉంటూ జమ్మూకశ్మీర్‌లో ఉన్నట్టు నమ్మించేవాడు. దీంతో ఈ వ్యవహరంతో విసుగెత్తి రామంతాపూర్‌కు చెందిన ప్రియారెడ్డి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి భరత్ కుమార్ శర్మను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
దైవ దర్శనానికి వెళ్లాలనుకుని ఇలా టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థను నమ్మి మోసపోవడం చాలా బాధగా ఉందని బాధితులు వాపోయారు. దీనిపై పోలీసులు ఇలా గుర్తింపు లేని ట్రావెల్స్‌ను సంప్రదించవద్దని సూచించారు. మోసపోయి చెల్లించిన నగదును ఎలాగైనా తమకు వచ్చేలా చూడాలని బాధితులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.