ACB raids AEE Nikesh Kumar's house : దాడులకు వెళ్లిన అధికారుల బృందానికి చిక్కకుండా ఓ అవినీతి ఉద్యోగి చేసిన ప్రయత్నం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ వైపు ఏసీబీ అధికారులు ఇంటికి వస్తున్నారని తెలిసిన ఉద్యోగి.. వారిని ఏమార్చేందుకు చేసిన ప్రయత్నం చర్చనీయాంశమైంది. తెలంగాణకు చెందిన నీటి పారుదల శాఖ ఏఈఈ నిఖేశ్‌కుమార్ పై గతంలో ఏసీబీ కేసు నమోదై ఉంది. తాజాగా అధికారులు తన ఇంటి తలుపు తట్టగానే కుటుంబసభ్యులకు సంకేతాలు ఇచ్చాడు. దీంతో వారు విలువైన పత్రాలను మూటగట్టి ఇంటి నుంచి బయటకు విసిరేయడం గమనార్హం. కానీ, అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ బృందం ఆ సంచిని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టింది. అధికారికంగా 17.73 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ వంద కోట్లకు పైమాటే అని అధికారులు తెలిపారు.
ఏసీబీ సోదాల్లో ఆస్తి పత్రాలు తప్ప నగదు లభించకపోవడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆరు నెలల కిందట ఏసీబీకి చిక్కిన నేపథ్యంలో నిఖేశ్ కుమార్ జాగ్రత్తలు తీసుకున్నాడని, అందుకే నగదు, బంగారం ఇంట్లో ఉంచలేదని సమాచారం. కానీ, నిఖేశ్‌కుమార్‌కు సంబంధించిన 8 బ్యాంకు లాకర్లు ఏసీబీ అధికారులు గుర్తించి తాళాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇవి నిఖేశ్ కుమార్ పేరిటే ఉన్నాయా? లేక బినామీల పేరిట ఉన్నాయా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతోంది. అతడిని కస్టడీకి తీసుకుని, ఆయన సమక్షంలోనే వాటిని తెరవాలని అధికారులు నిర్ణయించారు.
నిఖేశ్‌కుమార్‌కు చెందిన 5 ఐఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని విశ్లేషించడంపై దృష్టి సారించారు. అక్రమాస్తులకు సంబంధించి కీలక సమాచారం వాటిల్లో దొరుకుతుందని భావిస్తున్నారు. అంతేగాకుండా కుటుంబసభ్యుల పేరిట, గతంలో ఇంట్లో పని చేసిన ఒక సర్వెంట్‌ను బినామీ భారీగా ఆస్తులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ సర్వెంట్ అందుబాటులో లేకపోవడంతో పిలిపించి విచారించనున్నారు. నిఖేశ్‌కుమార్ భార్య తరఫు బంధువులు ఐదారుగురి పేరిట కొన్ని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించి వారి నుంచి ప్రాథమిక సమాచారం సేకరించారు. త్వరలోనే నోటీసులిచ్చి వాంగ్మూలం నమోదు చేయనున్నారు.
నిఖేష్ కుమార్ 2021-22 లో మొయినాబాద్ మండలం సజ్జనపల్లి, తోలకట్ట, నక్కలపల్లిలో ఫాంహౌస్‌లను కొనుగోలు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. సుమారు రూ.5 కోట్లు వెచ్చించి దాదాపు నాలుగెకరాల విస్తీర్ణం కలిగిన ఈ మూడు ఫామ్ హౌస్‌లు కొనుగోలు చేసినట్లు తేలింది. కొనుగోలుకు ముందు కొంత అడ్వాన్స్‌గా ఇచ్చి మిగిలిన మొత్తాన్ని ఒకే దఫా చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించినట్లు తేలింది. ఓ వాణిజ్య భవనం కొనుగోలు చేసినట్లు 3.5 కోట్ల రశీదులను అధికారులు ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు.
గతంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి చంచల్‌గూడ జైలుకు వెళ్లిన నిఖేష్‌కుమార్ అక్కడి పోలీస్ అధికారిని తరచూ కలిసినట్లు అధికారులు గుర్తించారు. ఏసీబీ కేసుల్లో చిక్కకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆధారాల ధ్వంసం, కేసు నుంచి బయటపడే మార్గాలపై పోలీస్ అధికారితో చర్చించినట్లు తేల్చారు. ఈ క్రమంలో నాటి నుంచే ఓ కన్నేసి ఉంచడంతో పాటు అతడి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టనుండగా మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశాలున్నాయి.
వైఎస్సార్సీపీ నేత ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ నివాసాల్లో ఏసీబీ తనిఖీలు