Suspended CI Caught by ACB Officials while Taking Bribe : హైదరాబాద్ నగరం రోజురోజుకూ అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా దేశ విదేశాల నుంచి భాగ్యనగరానికి ప్రముఖ కంపెనీలు, స్టార్టప్‌లు వరుస క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ పారిశ్రామిక, ఐటీ రంగం డెవలప్ చెందుతోంది. దీంతో హైదరాబాద్ చుట్టూ ఉన్న భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇక్కడ ఎకరం భూమి రూ.100 కోట్ల వరకు వెళ్తుందంటేనే ఏ రేంజ్లో ధర ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే కంపెనీలు సైతం అంతే పోటాపోటీగా డబ్బులను వెచ్చిస్తున్నాయో చూడవచ్చు.
ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ రంగం అనేది దినదినాభివృద్ధి చెందుతుంది. స్థిరాస్తి వ్యాపారం పెరిగేకొద్దీ ఆ ముసుగులో అనేక దందాలు జరుగుతున్నాయి. ఈ దందాల పంచాయితీల్లో కొందరు పోలీసులు సైతం కలుగుజేసుకొని వారి జేబులకు పని చెబుతున్నారు. తాజాగా స్థిరాస్తి వ్యాపార లావాదేవీపై నమోదైన కేసులో వ్యాపారి పేరును తొలగించడానికి లంచం తీసుకుంటూ ఓ సస్పెండైన సీఐ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సంగారెడ్డి సీసీఎస్‌లో పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో సాయి వెంకట కిశోర్ ఉన్నారు. ఆయన అమీన్పూర్లో ఉంటున్న స్థిరాస్తి వ్యాపారి రవిగౌడ్‌ను కొద్ది రోజులుగా డబ్బులివ్వాలంటూ బెదిరిస్తున్నాడు. అయితే నిరుడు కిశోర్ అమీన్పూర్ సీఐగా విధులు నిర్వహించారు. అప్పుడు సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో స్థిరాస్తి వ్యాపారికి సంబంధించి ఓ కేసు నమోదైంది. ఆ కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారి రవిగౌడ్ పేరును చేర్చారు. అప్పుడు ఆ కేసులో తన పేరును తొలగిస్తానని, అందుకు బదులుగా రూ.1.50 కోట్ల నగదు లేదంటే అమీన్పూర్లో రెండు ఫ్లాట్లు రాసివ్వాలని స్థిరాస్తి వ్యాపారిని కిశోర్ డిమాండ్ చేశాడు.
రవిగౌడ్‌ను బెదిరించిన కిశోర్ : దీంతో రవిగౌడ్ రెండు నెలల క్రితం రూ.10 లక్షలు ఇచ్చాడు. మిగిలిన రూ.1.40 కోట్లు తొందరగా ఉవ్వాలంటూ కిశోర్ అతనిపై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే కిశోర్ సంగారెడ్డి సీసీఎస్‌కు బదిలీ అయ్యాడు. అయినా రవిగౌడ్‌ను సస్పెండ్ సీఐ బెదిరించడం ఆపలేదు. ఇటీవల క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతను సస్పెండ్ అయ్యాడు. అయినాసరే రవిగౌడ్‌ను బెదిరించడం ఆపలేదు. తన స్నేహితులైన సీఐలతో డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి పెంచాడు.
దీంతో బాధితుడు చేసేదేమీలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల ప్లాన్‌లో భాగంగా సోమవారం రూ.5 లక్షలు ఇస్తానని చెప్పి మియాపూర్‌లోని మయూర్‌మార్గ్ వద్దకు రావాలని కిశోర్‌కు రవిగౌడ్‌తో ఫోన్ చేయించారు. అక్కడకు చేరుకున్న సస్పెండ్ పోలీసు కిశోర్ డబ్బులు తీసుకుని లెక్కిస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. అనంతరం నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో కిశోర్‌ను హాజరుపరిచారు.
ఏసీబీ ట్రాప్- రూ.3లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీసీఎస్ సీఐ