Govt Officers Bribe Cases in Telangana 2024 : రాష్ట్రంలో ఓకేరోజు రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సోమవారం నాడు హనుమకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దారు కార్యాలయంలో ధరణి ఆపరేటర్ రాకేశ్ రూ.5,000లు లంచం తీసుకుంటుండగా అధికారులు అతణ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందులో తహసీల్దారు పి.మాధవికి రూ.4,000లు వాటా ఉన్నట్లు తమ విచారణలో తేలడంతో ఇద్దరినీ అరెస్టు చేసి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య పేర్కొన్నారు.
Kamalapur MRO Bribe Case : ఇందుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 9న కన్నూరు గ్రామ పరిధి రాములపల్లెకు చెందిన రైతు కసరబోయిన గోపాల్ తన తండ్రి రాజయ్య పేరిట ఉన్న మూడెకరాల రెండు గుంటల వ్యవసాయ భూమిని గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి మీసేవలో ధరణి స్లాట్ బుక్ చేసుకున్నారు. 10న తన తల్లిదండ్రులు, కుటుంబీకులతో కలిసి రిజిస్ట్రేషన్‌కు రాగా స్లాట్ దస్త్రం చూడకుండానే తర్వాత రావాలని తహసీల్దార్ సూచించారు. తిరిగి 18న కార్యాలయానికి వెళ్లగా రూ.6,000లు ఇస్తేనే పని చేస్తామని డిమాండ్ చేశారు.
దీంతో బాధితుడు హనుమకొండలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు వల పన్ని కార్యాలయంలో ఆపరేటర్ రాకేశ్, గోపాల్ నుంచి రూ.5,0000 తీసుకుంటుండగా పట్టుకున్నారు. కాగా అధికారులను ఏసీబీకి పట్టించిన గోపాల్‌ను మరిపల్లి, గుండేడు గ్రామాల అన్నదాతలు ఎమ్మార్వో కార్యాలయం ఆవరణలోనే ఆయనను సన్మానించారు.
ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ అధికారిణి - రూ.84వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
ACB Caught Panchayati Raj Senior Assistant in Sircilla : మరో ఘటనలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ జోగినిపల్లి భాస్కర్‌రావు రూ.7,000లు లంచం తీసుకుంటుడంగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి పేర్కొన్నారు. గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన గుత్తేదారు గొల్లెని వెంకటేశ్ తన స్వగ్రామంలో 2021లో మైనార్టీ సంక్షేమ నిధులు రూ.4.30 లక్షలతో శ్మశాన వాటిక ప్రహరీ నిర్మించారని డీఎస్పీ చెప్పారు. సంబంధిత బిల్లు కోసం భాస్కర్‌రావును సంప్రదించగా, 4 నెలలపాటు రేపుమాపంటూ తిప్పుకొన్నారని అన్నారు.
చివరకు బిల్లు మంజూరు కావాలంటే భాస్కర్‌రావు రూ.8,000లు ఇవ్వాలని గుత్తేదారు గొల్లెని వెంకటేశ్‌ను డిమాండ్ చేశారని డీఎస్పీ రమణమూర్తి చెప్పారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడని, వారు వల పన్ని గుత్తేదారు నుంచి భాస్కర్‌రావు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారని పేర్కొన్నారు. నిందితుడిని కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ రమణమూర్తి వెల్లడించారు.
ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం - లంచం తీసుకుంటూ చిక్కిన శామీర్‌పేట ఎమ్మార్వో