ACB Caught Govt Officer While Taking Bribe : రాష్ట్రంలో ఏసీబీ ఎన్ని కేసులు నమోదు చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో అవినీతి అధికారుల పంథా మాత్రం మారడం లేదు. ఇటీవల అవినీతి నిరోధక శాఖ వరుస దాడులు చేసినప్పటిపీ కొంతమంది అవినీతి అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం పడింది. ఇంటి పన్ను విషయంలో లంచం తీసుకుంటూ ఎల్బీనగర్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్(బిల్ కలెక్టర్) విజయ్ భార్గవ్ కృష్ణ ఎసీబీకి చిక్కారు. ఆ వివరాలను ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు.
ACB DSP on Bribe Case : ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నరసింహారెడ్డి అనే జీహెచ్ఎంసీ విశ్రాంత ఉద్యోగి కర్మన్ఘట్ నూతనంగా నిర్మించిన ఇంటికి సంబంధించి ఇంటినంబర్ కేటాయింపు, ట్యాక్స్ సవరణ గురించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో అప్లై చేసి ఫీజు కూడా చెల్లించారు. అయినప్పటికీ సంబంధిత అధికారి ఇంటినంబర్ కేటాయించకపోవడంతో ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయానికి సంబంధించిన ఉద్యోగి విజయ్ భార్గవ్ కృష్ణను సంప్రదించారు. దీంతో విజయ్‌భార్గవ్ కృష్ణ విశ్రాంత ఉద్యోగి నుంచి 10 వేల రూపాయలు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అన్ని ఫీజులను చెల్లించానని బాధితుడు చెప్పారు. తానుకూడా జీహెచ్ఎంసీ మాజీ ఉద్యోగి అని చెప్పినప్పటికీ అవేవీ వినకుండా బిల్‌కలెక్టర్ అయిన విజయ్ భార్గవ్ కృష్ణ తనకు పదివేల రూపాయలు లంచం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి నుంచి ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో సదరు వ్యక్తి నుంచి 10 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, అతడిపై కేసు నమోదు చేసుకుని లంచం తీసుకున్న పదివేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేసి, దర్యాపు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం - రూ.3 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ నల్గొండ ఆసుపత్రి సూపరింటెండెంట్