ACB Caught Four Govt Officials in Bribe Case : హైదరాబాద్ నాంపల్లి రెడ్‌హిల్స్‌లోని రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ పర్యవేక్షక ఇంజినీర్ కార్యాలయంలో గురువారం రాత్రి నలుగురు ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. రంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న బన్సీలాల్‌తో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్ ఇంజినీర్లు కార్తీక్, నికేశ్‌తో పాటు లంచం తీసుకుంటుండగా మరో కీలక అధికారిని ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.
Govt Officers Bribe Cases in Telangana 2024 : నీటిపారుదల శాఖలో క్యాడ్ అనేది మానిటరింగ్ సెల్‌గా పనిచేస్తుంది. ఈ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఈ ముగ్గురు ఉద్యోగులు ఓ వ్యక్తి నుంచి రూ.2.5 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఒక కల్వర్టు విషయంలో బిల్లులకు సంబంధించిన దస్త్రంపై సంతకం కోసం వీటిని డిమాండ్ చేశారని అధికారవర్గాలు చెబుతున్నాయి. బాధితుడు గతంలోనే లక్ష రూపాయలు చెల్లించాడు. మళ్లీ ఇప్పుడు మరో లక్షన్నర డిమాండ్ చేయడంతో ఆయన ఏసీబీని ఆశ్రయించాడు. అప్పటి నుంచి ఇరిగేషన్ అధికారులపై దృష్టి సారించిన ఏసీబీ, ఈఈతో పాటు ఇద్దరు అసిస్టెంట్ ఇంజినీర్లను పట్టుకుంది.
మరోవైపు ఈ వ్యవహారంతో ప్రమేయం ఉన్న మరో అధికారి అక్కడి నుంచి పరారయ్యాడు. చివరకు నాలుగు గంటల పాటు శ్రమించిన ఏసీబీ అధికారులు ఎట్టకేలకు షేక్‌పేట్ ప్రాంతంలో ఆయనను పట్టుకున్నారు. ఆ తర్వాత అతణ్ని అర్ధరాత్రి రెండు గంటల సమయంలో రెడ్‌హిల్స్‌లోని రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ పర్యవేక్షక ఇంజినీర్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారించారు. హైడ్రామా నడుమ అదుపులోకి తీసుకున్న ఆ నాలుగో వ్యక్తి ఎవరనేది అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఆ ఉద్యోగి ప్రాథమికంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఓ సర్వేయర్‌గా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే గురువారం రాత్రి దాదాపు ఏడెనిమిది గంటల పాటు కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. మరోవైపు అదుపులోకి తీసుకున్న వారిని అక్కడే విచారించిన అధికారులు, ఈరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి నిందితులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. ఈ కేసుపై అధికారులు మరితం లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంతో ఇంకా ఎవరెవరికి ప్రమేయం ఉంది? తీసుకున్న డబ్బులు ఎవరెవరికి చేరుతున్నాయనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.
ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం - లంచం తీసుకుంటూ చిక్కిన శామీర్‌పేట ఎమ్మార్వో