Kidnap case in Madanapalli : మూడు నెలలుగా వారిద్దరి మధ్య మాటల్లేవు. ఇష్టపడిన వాడే దూరం పెడుతున్నాడు. అతడంటే ఆమెకు చెప్పలేనంత ఇష్టం. మరోవైపు చేజారిపోతాడేమోనన్న భయం. వీటన్నింటికీ ఎలాగైనా ముగింపు పలకాలని నిర్ణయించుకున్న ఓ మహిళ తన ప్రియుడిని ఏకంగా అపహరించేందుకు యత్నించింది. పోలీసులకు విషయం తెలిసి, వెంబడించి వారి ఆటకట్టించారు. సినీ ఫక్కీలో జరిగిన ఘటన పూర్వాపరాలను తిరుపతి పడమర సీఐ రామకృష్ణ శుక్రవారం (నవంబర్ 29న) వెల్లడించారు.
పరిచయం కాస్తా సన్నిహితంగా : ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పెనుమూరు సమీపంలోని రేణుకానగర్‌కు చెందిన శ్రీనివాసులు (31) తిరుపతిలో వ్యాపారం చేస్తుంటారు. అక్కడే స్థానిక పెద్దకాపు వీధిలోని పార్థ డెంటల్ ఆసుపత్రి ఎదురుగా ఓ లాడ్జిని కూడా నిర్వహిస్తున్నారు. శ్రీనివాసులుకు ఇంకా వివాహం కాలేదు. దీంతో అతనికి మదనపల్లెకి చెందిన వివాహిత సోనియా భానుతో పరిచయం ఏర్పడింది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయారు. ఇద్దరి పరిచయం కాస్తా కలిసి తిరిగే వరకు వచ్చింది. చాలా కాలంగా సన్నిహితంగా ఉన్నారు. ఏమైందో ఏమో మరి మూడు నెలలుగా వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో శ్రీనివాసులు సోనియాను దూరం పెడుతున్నాడు. సోనియాకు ఓ భయం మొదలైంది. శ్రీనివాసులు ఎక్కడ తనకు దూరమవుతాడో అని.
సినిమాను తలపించేలా కిడ్నాప్ : శ్రీనివాసులును ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలనుకున్న సోనియా, చివరకు కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకుంది. మదనపల్లెకి చెందిన ఐదుగురు యువకులతో కలిసి కారులో గురువారం (నవంబర్ 28న) మధ్యాహ్నం తిరుపతికి పక్కా ప్లాన్ ప్రకారం వచ్చారు. కాపలా కాసి మాటు వేసి మరీ శ్రీనివాసులును అపహరించారు. లాడ్జి సిబ్బంది వెంటనే అప్రమత్తమై పోలీసులకు చెప్పారు. స్పందించిన పోలీసులు ప్రత్యేక బృందాలతో కిడ్నాపర్లను వెంబడించారు. మొత్తంగా ఈ కిడ్నాప్ ప్రక్రియ ఓ సినిమా సీన్‌ను తలపించిందని స్థానికులు చెబుతున్నారు.
అన్నమయ్య జిల్లాలోని వాయల్పాడు నుంచి వెళ్తున్న కిడ్నాపర్ల కారును పోలీసులు అడ్డగించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లెకి చెందిన బాబా ఫకృద్దీన్, మోక్షిత్, రాజేష్, రియాజ్, సందీప్‌లను నిందితులుగా గుర్తించారు. వారందరినీ వెంటనే ఠాణాకు తరలించారు. బాధితుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామకృష్ణ వెల్లడించారు.
త్వరలో వివాహం - ప్రేమించిన వాడితో వెళ్లిపోయిన యువతి - మహిళపై కుటుంబసభ్యుల దాడి
గ్రూప్-3 పరీక్ష కేంద్రంలో కుమార్తె - కిడ్నాప్ చేశామంటూ ఆగంతకుల ఫోన్ - వెళ్లి చూసేసరికి?