A Young Man Quit his Job And Doing Social Service In Tirupati : కష్టమొచ్చినప్పుడు ఎవరైనా సాయం చేస్తే బాగుండు అని కోరుకుంటాం. అది నేనే ఎందుకు కాకూడదని అనుకున్నాడా యువకుడు. ఆకర్షణీయమైన జీతం విలాసవంతమైన జీవితం వదులుకుని సేవామార్గం ఎంచుకున్నాడు. వే ఫౌండేషన్ స్థాపించి నిరుపేద బిడ్డలు ఉన్నతంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నాడు. పర్యావరణ పరిరక్షణ కోసమూ తన వంతు సాయమందిస్తున్న సమాజ సేవకుడి స్ఫూర్తి ప్రయాణమిది.
ఏదో కోల్పోతున్నాననే భావన : కలలుగన్న ఉద్యోగం, కోరుకున్న జీవితం దక్కినా చాలని ఆగిపోలేదు ఆ యువకుడు. నచ్చిన కెరీర్‌లో స్థిరపడినా నిత్యం ఏదో కోల్పోతున్నాననే భావన కుదురుగా ఉండనిచ్చేది కాదు. చిన్నతనం నుంచి అలవాటైన సేవలోనే సంతృప్తి ఉందని తెలుసుకుని సొంతూరికి తిరిగొచ్చాడు. పేదలకు విద్య, ప్రకృతి పరిరక్షణకు వే ఫౌండేషన్ స్థాపించి తన జీవితాన్ని సేవకు అంకితం చేశాడు. అతడే పైడి అంకయ్య.
శభాష్ - అభాగ్యులకు ఆత్మ బంధువు 'మన ఇల్లు'
ఉద్యోగం వదిలి సేవామార్గం : పైడి అంకయ్య సొంతూరు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని ఎం.కొంగరవారిపల్లి. వ్యవసాయ కూలీలైన తల్లిదండ్రులు ఊరిలో ఉపాధి దొరక్క తిరుపతి వలస వచ్చారు. అమ్మనాన్నల సంపాదన సరిపోక చిన్నతనంలో వార్తాపత్రికలు, పాలప్యాకెట్లు అమ్మగా వచ్చిన ఆదాయంతో చదువు కొనసాగించాడు. ECE విభాగంలో బీటెక్ కాగానే బెంగళూరులోని ప్రముఖ MNCలో జాబ్ సాధించాడు అంకయ్య. ఈ స్థాయికి చేరుకోవడానికి పేదరికంతో పెద్ద యుద్ధమే చేశానని అంటాడు. ఏసీ గదుల్లో ఉద్యోగం, సరిపడా జీతం వస్తున్నా ఉద్యోగం వదిలి సేవామార్గం ఎందుకు ఎంచుకున్నాడో ఇలా వివరిస్తున్నాడు.
"మా నాన్న రైతు కూలి. ఇంట్లో కనీసం పూట గడవటం కూడా కష్టంగా ఉండేది. బతుకుతెరువు కోసం తిరుపతి వచ్చినప్పుడు పాలు, పేపర్ వేసేవాడ్ని. వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని రోడ్లపై ఉన్న నిరుపేదల కోసం ఖర్చు పెట్టేవాడ్ని. ఇలా చిన్నతనం నుంచే అభాగ్యులకు అండగా ఉండటం అలవాటుగా మారింది. ఇంజినీరింగ్ పూర్తైన తర్వాత బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వచ్చింది. ఆరు నెలల పనిచేసిన తర్వాత సేవకు దూరమైపోతున్నాననే భావన కలిగింది. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేేసి మళ్లీ తిరుపతికి వచ్చా. ప్రస్తుతం పార్ట్ టైం జాబ్ చేస్తూ ఫుల్ టైం సర్వీసును కొనసాగిస్తున్నాను." - పైడి అంకయ్య, వే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు
అక్కడి నుంచే లోటస్ చిల్డ్రన్ హోం : 2014లో వే ఫౌండేషన్ ప్రారంభించి అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు అంకయ్య. పేదరికంతో వైద్యం దొరక్క దూరమైన తమ్ముడు చదువుకునేందుకు పడిన కష్టాల నుంచే లోటస్ చిల్డ్రన్ హోం ఆలోచన వచ్చిందని అంటున్నాడు. తిరుపతిలోని రెండు మురికివాడల్లో వలస కూలీల పిల్లలకు సాయంత్రాల్లో విద్యాబోధన, కళలు, ఆటలు నేర్పిస్తున్నాడు. చాలామంది ఏదొక సందర్భంలో మొక్కలు నాటినా వాటి సంరక్షణ పట్ల శ్రద్ధ వహించరు. అందుకోసమే పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రీన్ లైఫ్ వే వెబ్‌సైట్ లాంచ్ చేశాడు అంకయ్య. ఆసక్తి ఉన్నవారితో కలసి ఇప్పటివరకూ 20వేల మొక్కలు నాటాడు. లక్ష మొక్కలు నాటడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు.
పేదపిల్లల అభ్యున్నతికి కృషి : తిరుపతి వేదాంతపురం, గాంధీనగర్ ప్రాంతాల్లో లోటస్ చిల్డ్రన్ హోం నిర్వహిస్తోంది వే ఫౌండేషన్. ఇందులో మురికివాడల్లో నివసిస్తున్న 73 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేట్ ట్యూటర్లను నియమించి పేద విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందిస్తున్నారు. కొందరు స్వచ్ఛందంగా సంస్థ నిర్వహణకు సహకరిస్తున్నారు. పార్ట్‌టైం జాబ్ చేస్తూ పేదపిల్లల అభ్యున్నతికి పాటుపడుతున్న అంకయ్య కృషి మెచ్చి స్థానికంగా ఉన్న ఎంతోమంది వివిధ మార్గాల్లో తమవంతు సాయం అందిస్తున్నారు. మానవసేవే మాధవసేవ అని నమ్మి ఇంటాబయటా విమర్శలు ఎదురైనా ఉద్యోగం వదులుకుని సేవామార్గం ఎంచుకున్నాడు అంకయ్య. నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సాయం చేయడంలోనే తనకు సంతృప్తి అని చెబుతున్నాడు.
వ్యవసాయమంటే దండగ కాదు - పండగ అని నిరూపిస్తున్న యువ రైతులు
ఐడియా అదుర్స్ - హైడ్రోజన్‌తో నడిచే హైబ్రిడ్ స్కూటీ ఆవిష్కరణ - Hybrid Bike Runs with Hydrogen