Andhra Boy Selected For IPL: పట్టుదల, తపన ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు అనకాపల్లి జిల్లా కుర్రాడు. కుగ్రామం నుంచి ఐపీఎల్ క్రికెట్‌కు ఎంపికయ్యాడు. ఐపీఎల్ వేలం పాటలో రూ.30 లక్షలకు ఆ యువకెరటాన్ని పంజాబ్ కింగ్స్ దక్కించుకోవడంతో ఆ ప్రాంత ప్రజలు ఎంతో గర్వపడుతున్నారు.
కుటుంబ నేపథ్యం: అచ్యుతాపురం మండలం దోసూరుకు చెందిన పైలా అవినాష్ ప్రతిభతో ఈ ఘనతను సాధించాడు. అవినాష్ తల్లిదండ్రులు పైలా సత్యారావు, నాగమణి. వీరికి ఇద్దరు కొడుకులు. వారికి గల ఎకరంన్నర పొలంలో పంటలు సాగు చేసుకుంటూ తమ జీవనాన్ని సాగించేవారు. అయితే 2004 సంవత్సరంలో స్వగ్రామం నుంచి గాజువాకకు వలస వెళ్లిపోయారు. పరిమిత ఆదాయంతోనే వారి ఇద్దరు కుమారులను చదివించారు. చదువుతో పాటు క్రీడలపై ఉండే ఇష్టంతో వారికి క్రికెట్ సైతం నేర్పించారు. సత్యారావు 2005లో అబుదాబీకి వలస వెళ్లాడు. అక్కడ హెల్పర్‌గా పనిచేశారు. ఆమె భర్త కష్టపడి సంపాదించిన డబ్బులతో తన ఇద్దరు బిడ్డలను మంచి క్రికెటర్లగా తయారు చేయడానికి తల్లి నాగమణి ఎంతో కష్టపడింది. కొన్ని సంవత్సరాల క్రితం అక్కడి నుంచి వచ్చిన భర్త సత్యారావు ఇక్కడ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. ఆర్థిక కష్టాలు ఎదురైనా తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో క్రికెటర్‌గా మారాలనే లక్ష్యంతో అవినాష్ అన్నయ్య చరణ్‌తేజ్ ప్రయత్నించాడు.
అన్న స్థానంలో తమ్ముడు: చరణ్‌తేజ్ ఏపీ జట్టుకు మూడుసార్లు ఎంపికైనా ఆడే అవకాశం దక్కలేదు. నిరాశ చెందిన చరణ్ లండన్‌లో జిమ్ కోర్స్‌ను పూర్తిచేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అన్నకు దక్కని క్రికెట్ అవకాశాన్ని ఎలాగైనా సాధించాలనే ఒక దృఢ నిశేచయంతో అవినాష్ క్లబ్ క్రికెట్‌లో తన ప్రతిభ చూపాడు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో నిర్వహించిన చాలా పోటీల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాన్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా తన ఉత్తమ ప్రతిభను చూపాడు. బెజవాడలోని టైగర్స్ జట్టులో స్థానం సంపాదించి ఆ తరవాత ఆంధ్ర ప్రీమియం లీగ్‌లో పోటీపడి సెంచరీలు చేసి తనపై అందరి దృష్టి పడేలా చేసుకున్నాడు. అంతేగాక ఏపీ ప్రీమియం లీగ్ పోటీల్లో 181 స్ట్రయిక్‌రేట్‌తో 58 బాల్స్‌కు గానూ 105 పరుగులు చేసి నాటౌట్‌గా ఉండటంతో సుమారుగా 11 సిక్స్‌లు, 2 ఫోర్లు సైతం కొట్టడంతో ప్రతిష్ఠాత్మకమైన ఐపీఎల్‌కు పంజాబ్ కింగ్స్ తరఫున ఆడేందుకు ఓ గొప్ప సువర్ణావకాశాన్ని పుణికిపుచ్చుకున్నాడు.
ఏపీఎల్ కు ఎంపికయ్యాడిలా.. 24 ఏళ్ల అవినాష్ కుడిచేతి బ్యాటరు. క్రీజ్‌లో ఉంటే చాలు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. చూడముచ్చటైన బౌండరీలు, సొగసైన సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. బౌలరు ఎవరైనా సరే బాదడమే లక్ష్యంగా ముందుకుసాగుతాడు. అవినాష్ బ్యాటింగ్ చూడముచ్చటగా ఉంటుందని అభిమానుల కితాబిస్తున్నారు. అవినాష్ ఐపీఎల్ లో చోటు సంపాదించేందుకు విశాఖలో నిర్వహించిన ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఓ ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగిన ఏపీఎల్ సీజన్-3లో ఇది నభూతోనభవిష్యత్ అని చెప్పవచ్చు. గోదావరి జట్టుపై 55 బంతులకు గానూ 101 పరుగులతో అందరినీ ఔరా అనిపించాడు. రెండేళ్లకు ముందు జరిగిన తొలి సీజన్‌లో దాదాపు 180 పరుగులు చేసి తిరుగులేని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి ఆటతీరును గమనించిన పంజాబ్ కింగ్స్ జట్టు కిందటి నెలలో పంజాబుకు రమ్మని అతన్ని ఆహ్వానించింది. ఆటలోని నైపుణ్యాన్ని పసిగట్టిన ప్రాంఛైజీ యాజమాన్యం అవినాష్ ను ఐపీఎల్ జట్టుకి ఎంపిక చేసింది.
మామయ్య అన్నయ్యల ప్రోత్సాహంతోనే సాధ్యం: క్రికెట్ నేర్చుకున్న తొలి నాళ్లలో అన్నయ్య చరణ్‌తేజ ఆడుతుండడం చూసి అవినాష్ అటు వైపు మొగ్గు చూపాడు. మామయ్య ప్రసాద్ ఆర్థిక చేయూత అందించేవారు. బంతులను అలవోకగా బాదడంతో భవిష్యత్‌లో స్టార్ క్రికెటర్ అయ్యేందుకు అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. అవినాష్ చెన్నై ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో బాగా రాణించి భారత జట్టులో చోటు సంపాదించడమే లక్ష్యమని ఈ సందర్భంగా అతడు వెల్లడించాడు.
''కుమారుల ఆట కోసం మాకున్న భూమిని, సొంత గ్రామాన్ని సైతం విడిచి గాజువాకకు పయనమయ్యాం. ఆట శిక్షణకు ఇద్దరికీ అయ్యే ఖర్చు రూ.3 వేలు చెల్లించలేక ఒకరికే రూ. 1500 కట్టేవాళ్లం. చిన్న కుమారుడైన అవినాష్ పట్టుదలతో ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. నా కుమారుల ప్రతిభను ఎన్నోసార్లు అందరి క్రీడాభిమానుల మధ్య కూర్చొని ఆస్వాదించాను. ప్రేక్షకుల మాటలు ఆనందంతో పాటూ కన్నీరును తెప్పించాయి''- పైలా నాగమణి, అవినాష్ తల్లి
''టీం ఇండియాలో స్థానం పొందడమే లక్ష్యం: అన్నయ్య చరణ్‌తేజ్ అందించిన స్ఫూర్తి, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టాలను చూసి క్రికెట్‌లో సాధన చేశాను. పాఠశాల స్థాయి నుంచి కళాశాల వరకు ప్రతిభ కనబరిచాను. ఒక చేత్తో క్రికెట్ కిట్, మరోచేత్తో పుస్తకాల బ్యాగును మోసుకుంటూ ఆర్టీసీ బస్సుల్లో పాఠశాలకు వెళ్లి చదువుకుని క్రికెట్‌లో శిక్షణ పొందా. చదువులో రాణిస్తూనే ఎన్నో పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపించాను. ఈ ప్రయత్నంలో ఐపీఎల్‌కు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో టీం ఇండియాలో స్థానం సంపాదించడానికి ప్రయత్నిస్తా'' -పైలా అవినాష్, క్రికెటర్, దోసూరు
అమ్మకు గోల్డ్.. కూతురికి బ్రాంజ్.. పనిమనిషి కుటుంబానికి పతకాల పంట