Boy Kidnaped From Hospital By Two Thieves in Nizamabad : ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవం కోసం వస్తే, బాలుడిని అపహరించిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి ఆసుపత్రిలో తండ్రి వద్ద నిద్రిస్తున్న బాలుడిని ఇద్దరు వ్యక్తులు అపహరించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. బాలుడి కిడ్నాప్‌పై తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడి జాడ కనిపెట్టాలంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడి అపహరణ సంచలనం సృష్టించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడిని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాలుడిని ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. నగర శివారులోని మాణిక్ బండార్‌కు చెందిన నాగుల సాయినాథ్, ఛాయా దంపతుల కుమారుడు అరుణ్ (3 ). ఛాయ ప్రసవం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. భార్య, కుమారుడితో కలిసి వచ్చిన సాయినాథ్ ఆసుపత్రి ఆవరణంలో నిద్రించాడు. రాత్రి మూడు గంటల నుంచి బాలుడు కనిపించక పోవడంతో సాయినాథ్ పోలీసులను ఆశ్రయించాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తమ కుమారుణ్ణి అప్పగించాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
'ఆసుపత్రి వరాండాలో అందరం నిద్రిస్తున్నాం. ఆ సమయంలో ఇద్దరు యవకులు ఇక్కడికి వచ్చారు. కొంత సేపటివరకూ అక్కడే పడుకున్నట్లు నటించారు. ఆ తరువాత అదును చూసి నా వద్ద నిద్రిస్తున్న మా అబ్బాయిని అక్కడి నుంచి అపహరించి తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డు అయ్యాయి. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. సీసీ టీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా నింధితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మాకు ఓ వ్యక్తిపై అనుమానం ఉంది. అతని ఇంటికి వెళ్లి అక్కడ బాలుడి ఆచూకీ కోసం వెతుకుతాం.' నాగుల సాయినాథ్, బాలుడి తండ్రి