Rape on Minor Girl in Hyderabad : పక్కింట్లో ఉన్న బాలికపై నాలుగు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ 30 ఏళ్ల కామాంధుడు. బాధితురాలి తల్లి ఇంట్లో లేని సమయంలో ఆమెకు మాయమాటలు చెప్పి బెదిరించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికైనా ఈ విషయం చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. అతడి వేధింపులు మరింత ఎక్కువవ్వడంతో బాధితురాలు ఈ విషయాన్ని ఆమె తల్లికి చెప్పింది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఇదీ జరిగింది : ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రెండేళ్ల క్రితం అంబర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. ఆ ప్రాంతంలోనే ఓ మొబైల్ రిపేర్ వర్క్షాప్ను నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే పక్కింట్లో ఉండే ఓ ఎనిమిదో తరగతి బాలికపై అతడి కన్ను పడింది.
4 నెలలుగా అత్యాచారానికి పాల్పడుతూ : బాలిక తల్లి లేని సమయం చూసి ఆమెకు మాయమాటలు చెప్పి లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే నిందితుడి భార్య రెండో కాన్పు కోసం సొంతూరికి వెళ్లింది. భార్య ఊరు వెళ్లడాన్ని అదనుగా తీసుకున్న నిందితుడు బాలికను బెదిరించి లొంగదీసుకున్నాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విధంగా గత 4 నెలలుగా అత్యాచారానికి పాల్పడుతుండేవాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తా అని బెదిరించేవాడు. దీంతో భయపడిన బాధితురాలు తన బాధను ఎవరికీ చెప్పేందుకు ధైర్యం చేయలేదు.
పోక్సో కేసు నమోదు : గత కొద్ది రోజులుగా బాలికపై నిందితుడి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అతడు పెట్టే హింసను భరించలేక బాధితురాలు ఆమె తల్లికి ఈ విషయాన్నంతటినీ వివరించింది. దీంతో బాలిక తల్లి అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపారు.