Girl From Nalgonda Making Seed Balls For Environment Protection : నల్గొండకు చెందిన ఈ యవతి పేరు దీక్షిత. ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. యువతి పాఠశాలలో ఉన్నప్పడు సేవ్ నేచర్ - సేవ్ ట్రీస్ అనే కార్యక్రమం నిర్వహించారు. అక్కడ చెట్ల పెంపకం ఆవశ్యకత తెలుసుకున్న దీక్షిత, మొక్కలు పెంచడం ప్రారంభించింది. తర్వాత ఖాళీ ప్రదేశాలు, గుట్టలను లక్ష్యంగా చేసుకుని సీడ్ బాల్స్ చేసి వీలైనన్ని ఎక్కువ మొక్కలు పెంచడానికి కృషి చేస్తుంది. సమయం కుదిరిన ప్రతిసారి స్నేహితులతో సీడ్ బాల్స్ తయారు చేస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో విత్తన బంతులను తయారు చేస్తూ, వాటిని ఖాళీ ప్రదేశాలు, గుట్ట ప్రాంతాల్లో వెదజల్లుతున్నారు. ఇలా గత ఐదేళ్లుగా మొక్కలు పెంచుతూ, పర్యావరణ పరిరక్షణకు తమవంతు కృషి చేస్తున్నారు దీక్షిత.
సీడ్ బాల్స్ కోసం ఎర్రమట్టి, పేడ ఉపయోగించి ఇంటి వద్ద లభించే మామిడి, చింత, నిమ్మ, రేగు, కర్జూర, ఈత, వేపతో పాటు గ్రామాల్లో పెరిగే వివిధ రకాల చెట్ల గింజలను సీడ్ బాల్స్ తయారీలో ఉపయోగిస్తున్నారు. వారం రోజులు ఆరబెట్టిన తర్వాత, బస్తాల్లో నిల్వ చేస్తున్నారు. రోడ్డు పక్కన సీడ్ బాల్స్ వేయడం కంటే మనుషులకు దూరంగా గుట్టలపై వేస్తే అడవి జంతువులకు, పక్షులకు ఆవాసాలుగా మారతాయని, నాలుగు చినుకులు పడగానే ఇట్టే మొలిచేస్తాయని, అలాంటి ప్రదేశాల్లో ఈ సీడ్ బాల్స్ వేస్తున్నారు.
లక్ష సీడ్ బాల్స్‌ను అడవిలో నాటి : పుట్టిన రోజు వేడుకలకు స్నేహితులకు సీడ్ బాల్స్, మొక్కలను బహుమతులుగా ఇస్తున్నారు. ఎవరైనా ప్రముఖులు వస్తే వారికి బొకేల బదులు, సీడ్ బాల్స్ ఇచ్చి అవగాహన కల్పిస్తున్నారు. గత ఐదేళ్ల నుంచి సుమారు లక్ష సీడ్ బాల్స్ తయారు చేసి గుట్ట ప్రాంతాల్లో వేసినట్లు దీక్షిత చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని విత్తన బంతులు వెదజల్లుతున్నామని దీక్షిత చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు దీక్షిత కృషి చేస్తుందని, తమకు తోచిన సాయం అందిస్తున్నామని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. సీడ్ బాల్స్‌ను గుట్ట ప్రాంతాల్లోకి తీసుకువెళ్లడం, వాటిని అక్కడ వేయడం పెద్ద సమస్య అని, అయినా ఎక్కడా వెనకడుగు వేయకుండా చేస్తున్నామని చెబుతున్నారు.
ప్రభుత్వం ప్రోత్సహించాలి : సీడ్ బాల్స్ ఆలోచన చాలా బాగుందని, అందుకే ఖాళీ సమయంలో సీడ్ బాల్స్ తయారు చేస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం తరఫున గింజలు, మట్టిని అందిస్తే సీడ్ బాల్స్ సంఖ్య మరింత పెరుగుతుందని, వీటితో పాటు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని దీక్షిత తండ్రి కోరుతున్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటడం తమ లక్ష్యమని దీక్షిత అంటున్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా ముందుకు సాగుతామని దీక్షిత చెబుతున్నారు.
పర్యావరణ రక్షణకు పదో తరగతి విద్యార్థిని ముందడుగు.. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తూ..!
మానవాళికి శాపంగా భూతాపం- మన కర్తవ్యమేంటి? ఏం చేయాలి? - World Environment Day 2024