A Man Died After Falling in Water Sump in Hyderabad : చిన్నపాటి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఇంట్లో నీటి సంపును తెరిచి ఉంచటంతో ప్రమాదవశాత్తు యువకుడు పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి ఖలీల్ కుమారుడు అక్మల్ సుఫియాన్ ఖమ్మంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. శిక్షణ నిమిత్తం అక్మల్‌ను కంపెనీ వారు హైదరాబాద్‌కు పంపించి, గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉండేందుకు నివాసం ఏర్పాటు చేశారు. ఉదయం వ్యాయామశాలకు వెళ్లిన అతను అరటిపండ్లు కొనుక్కుని ఫ్లాట్‌కు బయలుదేరాడు. అప్పటికే, ఇంటి యజమాని ఆవరణలో ఉన్న సంపులో మోటార్ వేసి, ఇంట్లోకి వెళ్లిపోయాడు.
ఇదే సమయంలో అపార్ట్‌మెంట్‌కు వచ్చిన అక్మల్ సంపు తీసి ఉండటాన్ని గమనించక, అందులో పడిపోయాడు. ఏదో శబ్దం రాగా బయటికి వచ్చి గమనించిన యజమాని, సంపులో చూసినా లోతుగా ఉండటంతో కనిపించలేదు. పక్కనే అరటి పండ్ల కవర్ పడి ఉండటాన్ని గమనించి, అనుమానంతో సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించగా విషయం తెలిసింది. వెంటనే సంపులోకి దిగి సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే అక్మల్ మృతిచెందాడు. కాగా ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Baby Girl Died in BommalaRamaram : నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి