Illegal Sand Mining Joint Krishna District : 'రాష్ట్రంలో నూతన ఇసుక విధానం ప్రకారం గుర్తించిన రేవుల్లో మాత్రమే, అదీ యంత్రాలు లేకుండా కూలీలతోనే ఇసుక లోడింగ్ చేయాల్సి ఉంది. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ఉచితంగా తీసుకొని వెళ్లొచ్చు. వాహనాలకు లోడింగ్, నిల్వ కేంద్రాల వరకు రవాణా ఛార్జీలు మాత్రమే వసూలు చేయాల్సి ఉంది.’ మరి ఈ చిత్రం చూశారా? ఇది మున్నేరు నదిలో కంచెల సమీపంలో ఆదివారం కనిపించిన దృశ్యం. రెండు భారీ జేసీబీలు పెట్టి లారీలకు ఇసుక లోడింగ్ చేస్తున్నారు.
యంత్రాలతో తవ్వకంపై నిషేధం ఉన్నా అక్కడ షరా మూమూలే. ఒక్క లారీకి లోడ్ చేసినందుకు రూ.10,000లు వసూలు చేస్తున్నారు. ముందుగా విజయవాడ నగరంలో నగదు చెల్లించి టోకెన్ తీసుకుంటే ఆ టోకెన్ ప్రకారం ఇసుక లోడింగ్ చేస్తున్నారు. ఇక్కడ లోడ్ చేస్తున్న ఇసుక నేరుగా జాతీయ రహదారి ఎక్కి హైదరాబాద్‌కు తరలిపోతోంది. రాత్రి పూట ఎక్కువగా లోడింగ్ జరుగుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.
ఆయన వైఎస్సార్సీపీ నాయకుడు. గత ఐదు సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్‌లోనే తిష్టవేశారు. గత ప్రభుత్వంలో రెండేళ్ల పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా ఇసుక కాంట్రాక్టు ఆయనకే అప్పగించారు. అనధికార కప్పం నెలకు రూ.18కోట్లు చెల్లించే విధంగా అంగీకారం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి అండదండలు పుష్కలం. లారీలు జేసీబీలు ఉన్న ఆ నేత ఇష్టానుసారం తవ్వకాలు జరిపి హైదరాబాద్‌కు ఇసుక తరలించారు.
AP Free Sand Policy Irregularities : ప్రభుత్వం మారింది. ఆయన పార్టీ మార్చారు. ప్రస్తుతం ఓ మంత్రి మద్దతు ఉంది. అంతే మళ్లీ ఇసుకపై కన్నేశారు. యంత్రాలతో తవ్వకాలు జరుపుతూ హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. స్థానిక నేతలు ప్రశ్నిస్తుంటే కొంత మంది ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు. ‘నాకు తెలిసినంతగా ఇసుక వ్యాపారం మీకు తెలియదు. హైదరాబాద్ ఎలా రవాణా చేయాలో నాకు అవగాహన ఉంది. మీరు మౌనంగా ఉండండి’ అంటూ స్థానిక నాయకుల నోర్లు మూయించేశారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఆయన చెప్పినదానికే సై అన్నారు. ఇంకేముంది రోజుకు 150 లారీలు హైదరాబాద్ తరలిపోతున్నాయి.
విజయవాడలో టోకెన్ - నదిలో లోడింగ్ : ఇసుక లోడింగ్ అంతా టోకెన్ విధానంలో నడిపిస్తున్నారు ఆ నేత. విజయవాడలోని ఓ ఆఫీసులో ఇసుక లోడింగ్ కోసం లారీల యజమానులు సొమ్ములు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క లారీకి రూ.10,000లు చెల్లించాలి. పెద్ద లారీకి రూ.20,000లు ధర నిర్ణయించారు. దీనికి టోకెన్లు ఇస్తారు. ఈ టోకెన్లు ప్రకారం రేవుల్లో, నిలువ కేంద్రాల్లో లోడింగ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఇదే పద్ధతి జరుగుతోంది.
ప్రస్తుతం కృష్ణా నదిలో వరద ఉండడంతో కేవలం మున్నేరు నుంచి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉండడంతో హైదరాబాద్‌కు చాలా సులభంగా తరలించేస్తున్నారు. పెండ్యాల, 1, 2 రేవులు, కంచెల, కీసర, మూగలూరు, పెనుగంచిప్రోలులో తవ్వకాలు చేస్తున్నారు. కీసరలో 2.12లక్షల టన్నులు, మూగలూరు నిలువ కేంద్రంలో 89,000ల టన్నుల ఇసుక ఉండేది. ఇందులో లక్ష టన్నులు మాత్రమే విక్రయించారు. మిగిలిన ఇసుక మొత్తాన్ని ఈ నాయకుడు మాయం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయనకు ఓ మంత్రి అనుచరుడిగా గుర్తింపు ఉంది. అధికారులకు మంత్రి ఆదేశాలు ఇవ్వడంతో ఆయన లారీలను ఆంధ్రప్రదేశ్‌లో నిలుపుదల చేయడం లేదనే ప్రచారం జరుగుతోంది.
కృష్ణా నది దిగువన వరద తగ్గడంతో రేవుల్లో ట్రాక్టర్లతో ఎత్తి లారీల్లో నింపుతూ రవాణా చేస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో రీచ్‌లు లేని ప్రాంతాలను సైతం తవ్వేస్తున్నారు. పామర్రు నియోజకవర్గ పరిధిలో పమిడిముక్కల, తోట్లవల్లూరు మండలాల పరిధిలో ఘంటసాల మండలంలోనూ ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. పోలీసులు, గనుల శాఖ అధికారులు మున్నేరులో శనివారం డ్రోన్లు ఎగరవేసి హల్‌చల్ చేశారు. కానీ ఎక్కడా గుర్తించలేకపోయారు. జాతీయ రహదారికి పక్కనే తవ్వకాలు జరుపుతున్నా నిఘా కళ్లకు కనిపించడం లేదు.
ఆ 15 మంది MLAలకు చంద్రబాబు వార్నింగ్! - ఉచిత ఇసుక సరఫరా, మద్యం టెండర్లలో జోక్యం