Bhadradri Forest Officials Found The Hawk : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో జీపీఎస్ ట్రాకర్‌తో తిరుగుతున్న రాబందును అటవీ శాఖ అధికారులు ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నారు. జీపీఎస్, కెమెరాతో ఉన్న ఆ రాబందు సంచరించడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. గత మూడు రోజుల నుంచి చర్ల మండలంలో ఒక రాబందు సంచరించింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ చర్ల మండలంలోని ఏకలవ్య విద్యాలయం గుట్ట ప్రాంతానికి వచ్చి రాబందు అక్కడే కూర్చుండిపోయింది. తిరిగి వచ్చిన రాబందు అలసిపోవడం గమనించిన స్థానికులు కోడి మాంసం, నీటిని అందించారు. అగి తింటున్నప్పడు స్థానికులు దాని ఫొటోలు, వీడియోలు తీశారు.
అక్కడ కొద్ది సేపు సేద తీరిన రాబందు తర్వాత వేరే ప్రాంతానికి ఎగిరి వెళ్లిపోయింది. తర్వాత ఆ ఫొటోలు, వీడియోలు గమనించిన స్థానికులు దానికి జీపీఎస్ ట్రాకర్, కెమెరా ఉండటాన్ని గమనించారు. దీంతో ఆ రాబందు ఎక్కడి నుంచో వచ్చిందోనని స్థానికంగా చర్చలు మొదలయ్యాయి. మావోయిస్టులపై నిఘా కోసమా లేదంటే రాబందుల పయనం గురించి తెలుసుకునేందుకు అమర్చారా అనే చర్చ మొదలైంది. చివరకు విషయం అటవీశాఖ అధికారులకు చేరడంతో వారు దాన్ని పట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎట్టకేలకు గురువారం ఉదయం అటవీ అధికారులకు అది చిక్కింది. కాగా ప్రస్తుతం ఆ పక్షిని అటవీ శాఖ కార్యాలయంలో పెట్టారు.
పావురాల గుట్ట కేంద్రంగా సంరక్షణ : రాష్ట్రంలో రాబందుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ప్రస్తుతం 50 కంటే తక్కువే ఉన్నాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. పర్యావరణ సమతుల్యతలో రాబందుల పాత్ర చాలా కీలకం. అందుకే ఈ జాతిని అంతరించిపోకుండా కాపాడేందుకు పక్షి ప్రేమికులు, శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. వీటి సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అటవీ శాఖ కూడా ఈ ప్రాజెక్టులో భాగమైంది. వీరి సంరక్షణ చర్యల పుణ్యమా రాష్ట్రంలో వీటి సంఖ్య 30కి పైగా చేరింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా వీటి సంతతిని సంరక్షిస్తున్నారు. ఇక్కడ ఉన్న పావురాల గుట్ట వీటికి కేంద్రం. ఈ ప్రాంతాన్ని 'జటాయువు' పేరుతో రాబందుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కేంద్రానికి కూడా విజ్ఞప్తి పంపింది.