Vegetables Prices in Telangana : ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు అన్నట్లుగా తయారైంది కూరగాయల ధరల పరిస్థితి. రోజు రోజుకు వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణలో టమాటా, బెండకాయ, పచ్చిమిర్చి, బీరకాయ, వంకాయ ఇలా ప్రతి దాని ధర మండిపోతోంది. సాధారణంగా వేసవి కాలంలో కూరగాయల ధరలు పెరుగుతాయి. వర్షాకాలం మొదలవగానే మళ్లీ తగ్గుతుంటాయి. ఇది ఏటా సహజమే. కానీ ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.
వేసవి సీజన్‌లో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరల ధరలు నియంత్రణలోనే ఉన్నాయి. వర్షాకాలం మొదలయ్యాక, వర్షాభావ పరిస్థితుల నడుమ నగరం, పట్టణం, గ్రామం అన్న తేడాలు లేకుండా గత 20 రోజుల వ్యవధిలోనే అమాంతంగా ధరలు పెరిగాయి. రైతుబజార్లలోని ధరలతో పోలిస్తే బహిరంగ, చిల్లర మార్కెట్లలో 30 నుంచి 60 శాతం వరకు అధికంగా ఉంటున్నాయి.
కేజీ టమాటా ధర జూన్ ఆరంభంలో 25 రూపాయలు ఉండగా, ప్రస్తుతం 100 రూపాయలకు చేరింది. వంకాయ 40 రూపాయలు, పచ్చిమిర్చి కిలో 80 రూపాయలకు చేరింది. బీన్స్ 120 రూపాయలు, గింజ చిక్కుడు 80 రూపాయలు, క్యారట్, బీట్‌రూట్ 70 రూపాయలు, క్యాప్సికం 80 రూపాయలు, సొరకాయ 40 రూపాయలు, కాకరకాయ 50 రూపాయలు, పందిరి బీర 60 రూపాయలు చొప్పున ధరలు పలుకుతున్నాయి.
రెట్టింపు ధరలు.. ఇక పుదీనా, కొత్తిమీర, పాలకూర, బచ్చలి, తోటకూర, మెంతికూర సహా ఇతర ఆకుకూరలు ధరలు రెట్టింపయ్యాయి. 20 రూపాయలకు నాలుగైదు చిన్న కట్టలు ఇస్తున్నారు. అటు మే 20వ తేదీన కిలో ఉల్లిగడ్డ ధర 20 రూపాయలు పలికింది. ఇప్పుడది 50 రూపాయలకు చేరింది. రైతుబజార్లు, చిల్లర మార్కెట్‌లలో ధరలు చుక్కులు చూపిస్తున్నాయని వినియోగదారులు వాపోతోన్నారు.
తెలంగాణ జనాభాకు ప్రతి ఏటా 38.54 లక్షల టన్నుల కూరగాయలు అవసరం. ప్రస్తుతం 19.54 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్రంలో ఒక కోటి 31 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆహార పంట వరి సహా పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, పొద్దుతిరుడు, నువ్వులు, కంది, పెసర, ఇతర చిరుధాన్యాలు వంటి అన్ని రకాల పంటలు సాగవుతుండగా, అందులో కూరగాయల పంటలు 3.11 లక్షల ఎకరాలకే పరిమితం అయ్యాయి.
ఈ కారణంగా సుమారు 19 లక్షల టన్నుల దిగుబడుల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ వేసవిలో స్థానికంగా కూరగాయలు ఉత్పత్తి 25 శాతం తగ్గిపోయింది. డిమాండ్‌కు తగ్గట్లుగా ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నారు. మే వరకు ధరలు అదుపులోనే ఉన్నాయి. కానీ, ఈ నెల మొదటి వారంలో వర్షాలు మొదలయ్యాక సమస్యలు ఆరంభం అయ్యాయి.
అకాల వర్షాలతో ప్రభావం.. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో అకాల వర్షాలు, వడగండ్ల వానలు, ఈదురు గాలులు కూరగాయలు, ఆకుకూరల తోటలను దెబ్బతీశాయి. ఆ తర్వాత అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావం వల్ల స్థానికంగా సాగు చేసిన కూరగాయల పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. వేసవిలో బెట్ట, నీటి ఎద్దడి ఫలితంగా కూరగాయల పంటలకు తెగుళ్లు, చీడపీడలు ఆశించడంతో క్రిమిసంహారక మందులు పిచికారీ చేసినా పంట చేతికందక రైతులు నష్టాలపాలయ్యారు.
రాజధాని హైదరాబాద్ చుట్టు పక్కల రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్‌నగర్, యాదాద్రి, నల్గొండ తదితర జిల్లాల్లో స్థానికంగా కూరగాయల దిగుబడులు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలను తెస్తున్నారు. ఫలితంగా రవాణ భారం పెరగడం, తాజాదనం తగ్గడం వల్ల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. దిగుబడులు ఎక్కువ వచ్చినపుడు నిల్వ చేసుకునే సౌకర్యాలు లేకపోవడం కూడా ధరల పెరుగుదలకు కారణం అవుతోంది.
ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాల నేపథ్యంలో సంభవిస్తున్న మార్పులు నగరీకరణ, పట్టణీకరణ పుణ్యమాని అభివృద్ధి పేరిట పంట భూములన్నీ మాయం అవుతున్నాయి. నగరం, పట్టణం, గ్రామం వ్యత్యాసం లేకుండా ఎక్కడ చూసినా స్థిరాస్తి వ్యాపారం పెరిగిపోవడంతో సాగు చేసే భూమి విస్తీర్ణం తగ్గిపోతోంది. దీనికి కోతుల బెడద కూడా తోడైంది. ఐతే జనాభా అవసరాలకు తగ్గట్లు కూరగాయల సాగు పెరగాలంటే ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
సబ్సిడీపై ఫోకస్.. ఆర్కేవీవై(R.K.V.Y) కింద రైతులకు 50 శాతం రాయితీపై అధిక దిగుబడులు ఇచ్చే హైబ్రీడ్ వంగడాలు, రసాయన ఎరువులను అందజేసేది. పెద్ద ఎత్తున రాయితీలు, రుణాలు ఇప్పించ్చి ప్రోత్సహించేది. వాటిని మళ్లీ పునరుద్ధరిస్తే కూరగాయల సాగు పెరుగుతుందని అధికారులు అంటున్నారు. కూరగాయల దిగుబడులు ఈ నెలాఖరుకు కొంత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి లాగానే వర్షాకాలం సీజన్‌కు సంబంధించి పంటల సాగు కూడా మొదలై 25 రోజులు గడుస్తున్నాయి. ఆయా పంటల దిగుబడులు జులై, ఆగస్టు మాసాల్లో రైతుల చేతికొస్తాయి. అవి మార్కెట్‌లోకి వస్తే ధరలు తగ్గుతాయని ఉద్యాన శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు.