Case Register on Venkatarami Reddy : బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యీ వెంకట రామిరెడ్డిపై(Venkatarami Reddy) సిద్దిపేట మూడో పట్టణ పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. ఎటువంటి అనుమతులు లేకుండా సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం రాత్రి ఐకేపీ, ఈజీఎస్ ఉద్యోగులతో ఎన్నికలకు సంబంధించి సమావేశాలు నిర్వహించినట్లు ఎన్నికల ప్లయింగ్ స్వ్కాడ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సిద్దిపేట త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించి, అనంతరం వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించడానికి అనుమతులు లేవు. నిబంధనల ఉల్లంఘన మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Raghunandan rao Complaints CEO : ఈఘటనపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్‌రావు(Raghunandan rao) స్పందించారు. వెంకట రామిరెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని, అతనిపై చర్యలు తీసుకోవాలని సీఈవోను(CEO) కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో వెంకట రామిరెడ్డి సమావేశమయ్యారని పేర్కొన్నారు.వెంకట రామిరెడ్డి సమావేశం గురించి అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చేసరికి అందరూ పారిపోయారని రఘునందన్ రావు తెలిపారు.
వెంకట రామిరెడ్డి సమావేశంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులు స్పందించలేదని తెలిపారు. వెంకట రామిరెడ్డి అక్రమ సమావేశంపై పోలీసులు ఇప్పటికి చర్యలు తీసుకోలేదని రఘునందన్ రావు వెల్లడించారు. వెంకట రామిరెడ్డి కలెక్టర్‌గా ఉన్నప్పుడు ప్రజలను దోచుకున్నారని ఆయన ఆరోపించారు. సెర్ఫ్ ఉద్యోగులతో వెంకట రామిరెడ్డి అక్రమంగా సమావేశం నిర్వహించారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతలు చేసే తప్పుడు పనుల్లో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కావొద్దని, తాను న్యాయపరంగా తీసుకునే చర్యల్లో ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోవద్దని హెచ్చరించారు.
మరోవైపు వెంకట రామిరెడ్డిపై. రఘునందన్ రావు ఈడీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు వాంగ్మూలం ఆధారంగా, వెంకట రామిరెడ్డిపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేయాలని రాఘనందన్రావు కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో, తెల్లపూర్లో వెంకట రామిరెడ్డి నివాసం రాజపుష్ప నుంచి కోట్ల రూపాయలు ఎన్నికల కోసం తరలించారని ఆయన ఆరోపించారు. పోలీస్ ఎస్కార్ట్ వాహనాలలో ఈ డబ్బులను తీసుకెళ్లారని ఆరోపించారు. రాధాకిషన్‌రావు చెప్పిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఆధారంగా, ఎమ్మెల్సీ వెంకట రామిరెడ్డిపై ఈడీ దర్యాప్తు చేయాలని కోరారు.
లీకేజీతో సంబంధం లేకుంటే కేటీఆర్ ఎందుకు స్పందించారు: రఘునందన్‌రావు