A Boy with a Rare Disease: పిల్లలు ఆరోగ్యంగా తోటి పిల్లలతో ఆడుతూపాడుతూ ఎదుగుతుంటే ఏ తల్లిదండ్రులైనా మురిసిపోతారు. వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దామని ఎన్నో కలలు కంటుంటారు. అలాంటిది పుట్టినప్పటి నుంచి చిన్నారి అంతుచిక్కని వ్యాధితో బాధపడుతుండటం, తోటి పిల్లలు సైతం దగ్గరకి రానివ్వకపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఇంతకీ, ఆ పిల్లవాడు ఎవరు ? అతడు బాధపడుతున్న వ్యాధి ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఈ బాలుడి పేరు జనార్థన్ మురుగన్. వయసు ఏడేళ్లు. వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు త్యాగరాజ కాలనీకి చెందిన పీరయ్య, కొండమ్మల కుమారుడు. పుట్టుకతోనే అంతుచిక్కని వ్యాధితో జన్మించాడు. శరీరమంతటా మచ్చలు ఉండటం , చర్మం కాస్తా పొలుసులుగా మారి రక్తస్రావం అవుతుండటం, ఆహారం తీసుకోకపోవడం వంటి సమస్యలు ఆ పిల్లవాడ్ని పుట్టినప్పటి నుంచి బాధిస్తున్నాయి. తోటి పిల్లలతో ఆడుకునేందుకు పంపించాలన్నా, పిల్లవాడి శరీర ఆకృతి చూసి తోటి పిల్లలు వెనకాడుతున్నారని ఆ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు.
రూ. 30 లక్షల వరకూ ఖర్చు బాలుడి వ్యాధిని నయం చేయించడానికి ఆ తల్లిదండ్రులు ఏడేళ్లుగా కలవని వైద్యుడు లేరు,తిరగని ఆసుపత్రి లేదు. తమ బిడ్డ కూడా తోటి పిల్లలతో సంతోషంగా గడపాలని ఆ తల్లిదండ్రులు ఆశపడ్డారు. వ్యాధి నయం చేయించాలని ఉన్నదంతా ఆసుపత్రులకు దారపోశారు. 30 లక్షల వరకూ ఖర్చు చేసి చివరకు అప్పులపాలయ్యారు. కూలీనాలీ చేసుకుని బతికే తమ కుటుంబానికి ఇప్పుడు బాలుడి ఆరోగ్య సంరక్షణ భారంగా మారిందని తల్లిదండ్రులు బాధపడుతున్నారు.
ఇది విన్నారా.. చంకలో నుంచి చనుబాలు!
ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు: బాలుడి శారీరక పరిస్థితిని చూసైనా పాలకులు పింఛన్ ఇవ్వాలని ఆ తల్లిదండ్రులు అధికారుల్ని కోరారు. అయినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. పిల్లవాడి మందులకే నెలకు ఏడు వేల రూపాయలు ఖర్చవుతోందని, మందుల ఖర్చులు భారంగా మారడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. దాతలు ముందుకొచ్చి తమ బిడ్డ ఆరోగ్యాన్ని బాగు చేసి ఆదుకోవాలని ఆ కుటుంబం వేడుకుంటోంది.
'ఇప్పటి వరకూ సుమారు రూ . 30 లక్షలు ఖర్చు అయ్యాయి. పిల్లవాడి ఖర్చులకే నెలకే 7 వేల వరకూ ఖర్చు అవుతుంది. మా వల్ల కావడం లేకనే, గవర్నమెంట్ అధికారులను సంప్రదించాం. పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని విన్నవించాం. అయిప్పటికీ అధికారుల్లో స్పందన లేదు. శరీరమంతటా మచ్చలు ఉండటం, చర్మం కాస్తా పొలుసులుగా మారి రక్తస్రావం అవుతుండటం, ఆహారం తీసుకోకపోవడం వంటి సమస్యలు ఆ పిల్లవాడ్ని పుట్టినప్పటి నుంచి బాధిస్తున్నాయి.'- జనార్థన్ తల్లి కొండమ్మ