6 Years Old Girl From Nizamabad Wins Award in Dance : పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా ఆరేళ్ల చిన్నారి వాసన్ స్మరాసిని నాట్యంపై మక్కువతో జాతీయ స్థాయిలో ప్రదర్శనలిస్తోంది. తన కళా నైపుణ్యంతో అనేక పురస్కారాలు, బిరుదులు, ప్రశంసాపత్రాలు సాధిస్తూ నేటి బాలలకు ఆదర్శంగా నిలుస్తోంది. నిజామాబాద్ జిల్లా దత్తాపూర్‌కి చెందిన వాసన్ జనార్ధన్, గోదావరి దంపతుల మొదటి సంతానం స్మరాసిని. ప్రస్తుతం వీరు బాల్కొండలో ఉంటున్నారు. ఇప్పుడు ఈ చిన్నారి రెండో తరగతి చదువుతోంది. స్మరాసినికి నృత్యం పట్ల ఉన్న ఇష్టాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. రెండేళ్ల వయస్సు నుంచే సంప్రదాయ నృత్యం నేర్పించారు.
తన మొదటి ప్రదర్శన సరస్వతీ నిలయమైన బాసరలో ఇచ్చింది. ఇప్పటివరకు జాతీయస్థాయిలో 300కుపైగా అత్యుత్తమ ప్రదర్శనలు చేసింది. సంప్రదాయ నృత్యంతోపాటు ఫోక్, వెస్ట్రన్ డ్యాన్స్ చేయడం చిన్నారి ప్రత్యేకత. నిర్మల్ జిల్లాలో 11 వేల మందితో చేసిన కోటి కుబేర కుంకుమార్చన కార్యక్రమంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచి అందరి మన్నలను పొందింది. ఢీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోనూ స్మరాసిని డ్యాన్స్ చేసింది.
"నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం. మా అమ్మానాన్న నన్ను డాన్స్ స్కూల్లో చేర్పించారు. ఇప్పటివరకు నాకు చాలా అవార్డులు వచ్చాయి. నాకు భరతనాట్యం, ఫోక్, వెస్టర్న్ డాన్స్ వచ్చు. స్కూల్లో కూడా నేను ఫస్ట్ ర్యాంకు వస్తాను. పెద్దయ్యాక నాకు హీరోయిన్ కావాలనుంది." - స్మరాసిని, నృత్యకారిణి
రాజకీయ, సినీ ప్రముఖులు చిన్నారిని ప్రశంసించారు. చిన్న వయసు నుంచే పాటలు పాడటం సహా డబ్బింగ్ చెబుతోంది. యూట్యూబ్, ఇన్బాగ్రామ్‌లో షార్ట్స్ కూడా చేస్తోంది. ఓ సినిమాలోనూ స్మరాసినికి అవకాశం లభించింది. శివరాత్రి సందర్భంగా దాదాపు 33 వేల మందితో "మృత్యుంజయ మహా మంత్ర కోటి పారాయణం" కార్యక్రమంలో పాల్గొంది. అక్కడ శివుడి వేషధారణలో ప్రత్యేక ప్రదర్శన చేసి అందరినీ అబ్బురపరిచింది. నాట్య నందిని, నాట్య నయని, నాట్య మయూరి వంటి బిరుదులు సొంతం చేసుకుంది. ప్రదర్శన సమయంలో ఆమె హావభావాలు, ఆ పాత్రల్లో లీనమైపోవడం ప్రత్యేకంగా నిలబెట్టాయి. ప్రతి పాత్రకు తగ్గట్టుగా స్మరాసిని తల్లి గోదావరి ప్రత్యేక వస్త్రాలంకరణ చేస్తుంది.