White Ration Card Holders 4 Types of Goods : కూటమి ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి నాలుగు రకాల సరకులు అందించేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎంఎల్‌ఎస్ పాయింట్లకు కందిపప్పు చేరింది. కార్డుదారులకు బియ్యంతోపాటు కందిపప్పు, పంచదార, జొన్నలు పంపిణీ చేయనుంది. కచ్చితమైన తూకాలతో, నాణ్యమైన సరకు సరఫరా చేసే గుత్తేదారులకు బాధ్యతలు అప్పగించింది. అక్టోబరు నెలలో 50 శాతానికిపైగా కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేశారు. నవంబరులో ప్రతి కుటుంబానికి నాలుగు వస్తువులు అందించేలా ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చౌక ధరల దుకాణాలకు రేషన్ సరకుల సరఫరా జోరుగా సాగుతోంది.
పప్పన్నం దూరం చేసిన వైఎస్సార్సీపీ : బహిరంగ మార్కెట్‌లో పప్పు ధరలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పేదలకు కందిపప్పు అందించేలా చర్యలు తీసుకోవాల్సి ఉండగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎగ్గొట్టింది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు పప్పన్నం దూరం చేసింది. కిలో కందిపప్పు రూ.160-180 వరకు పలుకుతుండటంతో పేదలు కొని తినలేని పరిస్థితి ఏర్పడింది. తమకు కందిపప్పు అందించాలని విన్నవించినా ఏమాత్రం పట్టించుకోలేదు. చివరికి పేదలకు పచ్చడి మెతుకులే దిక్కైంది.
బియ్యానికి బదులు జొన్నలు : నవంబరులో కార్డుదారులకు నాలుగు రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. బియ్యం బదులు జొన్నలు చౌకధరల దుకాణాల్లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి కార్డుదారుడికి 3 కిలోల చొప్పున జొన్నలు ఇవ్వనున్నారు. నాణ్యమైన జొన్నలను డీలర్లకు సరఫరా చేస్తున్నారు. కానీ 35 శాతానికిపైగా డీలర్లు జొన్నలు తీసుకెళ్లడం లేదు. డీలర్లు సరకులన్నింటినీ దుకాణాలకు తీసుకెళ్లేలా పౌరసరఫరాల అధికారులు పర్యవేక్షణ చేయాల్సి ఉండగా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
గ్రామాలకు చేరవేత : నంద్యాల జిల్లాలో 90 శాతం మేర చౌకధరల దుకాణాలకు నిత్యావసర వస్తువులు చేరవేశారు. కర్నూలు జిల్లాలో రేషన్ సరకుల పంపిణీ కొంతమేర నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు 70 శాతానికిపైగా సరఫరా చేశారు. కర్నూలు జిల్లాలో 1,233 చౌకధరల దుకాణాలు ఉండగా వీటి పరిధిలో 6,76,209 తెల్ల రేషన్ కార్డులున్నాయి. నంద్యాల జిల్లాలో 1,204 చౌకధరల దుకాణాలు ఉండగా 5,41,804 తెల్ల రేషన్ కార్డులున్నాయి.
కిలో కందిపప్పు రూ.67 : నవంబరు నుంచి కిలో రూ.67 చొప్పున కందిపప్పు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 12.18 లక్షల మంది కార్డుదారులు ఉండగా 9.85 లక్షల మందికి కందిపప్పు పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు ముమ్మరం చేసింది. డీలర్లు డీడీలు చెల్లించి సరకు తీసుకెళ్లాల్సి ఉంది.
తీయని ప్రణాళిక : పంచదార 95 శాతానికి పైబడి పంపిణీ చేయనున్నారు. 11.46 లక్షల మంది కార్డుదారులకు పంచదార పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల గోదాముల్లో నిల్వలున్నాయి. ఇప్పటికే 80 శాతానికిపైగా చౌకధరల దుకాణాలకు నిత్యావసరాలను చేరవేస్తున్నారు. ఏఏవై కార్డుదారులకు పంచదార కిలో రూ.14, మిగిలిన కార్డుదారులకు అర కిలో రూ.17 చొప్పున అందించనున్నారు.
సబ్సిడీ ధరల్లో నిత్యావసర సరకులు- రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు - Essential Commodities Distribution