Three Telangana Students Died in America Car Crash : విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు చూసే మొట్టమొదటి దేశం అమెరికాా. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు అక్కడ ఉన్నత చదువులు చదువుకోవాలని కలలుకంటుంటారు. అలాంటి వారిలో తెలుగు విద్యార్థుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి, జీవితంలో స్థిరపడాలని బ్యాంకుల్లో అప్పులు తెచ్చి మరీ అగ్రరాజ్యానికి పంపిస్తుంటారు.
విద్య పూర్తి చేసుకుని తిరిగొస్తారని గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్న కుటుంబసభ్యులకు తమ పిల్లలు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, హత్యలకు గురవుతున్నారనే వార్తలు తీరని వేదనను మిగులుస్తున్నాయి. తాజాగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని రోడ్డు నం.75లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ విద్యార్థులు సహా నలుగురు భారతీయులు మృతి చెందారు.
అమెరికా రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని రోడ్డు నం.75లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా, మరొకరు తమిళనాడు వాసి. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. కార్ పూలింగ్ ద్వారా ఈ నలుగురు బెన్‌టోన్‌విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు ఒకే వాహనంలో ఎక్కారని తెలిపారు.
హైదరాబాద్ వాసుల దుర్మరణం : వరుసగా 5 వాహనాలు ఒకదానినొకటి అతివేగంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. డల్లాస్‌లో బంధువును కలిసి ఇంటికి వెళ్తున్న ఆర్యన్ రఘునాథ్, భార్యను కలిసేందుకు లోకేశ్, యూనివర్సిటీకి వెళ్తున్న దర్శిని వాసుదేవన్, ఫరూఖ్ ఈ కారులో ఎక్కారు. వీరు ప్రయాణిస్తున్న వాహనానికి మంటలు అంటుకోవడంతో బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది. వీరి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోవడంతో కార్ పూలింగ్ యాప్‌లో నమోదైన వివరాల ఆధారంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. వెంటనే అక్కడి పోలీసులు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వీరి మృతిపై స్నేహితులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి - అనుమానాస్పద స్థితిలో సిద్దిపేట యువకుడి మృతి