Ganesh Immersion 2024 : హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం అయ్యింది. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం అత్యంత వైభవంగా జరుగుతుంది. ముంబయి తర్వాత హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రజలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా నిమజ్జన ఉత్సవాలను కనులారా చూసేందుకు హైదరాబాద్‌కు తరలివస్తారు.
ఉత్సవాలకు వచ్చే భక్తులకు, ప్రజలకు రవాణా పరంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులను పెంచడంతో పాటు, ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడిపించాలని నిర్ణయించింది. ఖైరతాబాద్ బడా గణేశ్ సహా, వినాయక నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న ఆయన, స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, మొదటిసారిగా గణపతి మండపాలకు ఉచిత విద్యుత్ అందించామని తెలిపారు. నిమజ్జనం కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో 360 క్రేన్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. భక్తులు కూడా శాంతియుతంగా నిమజ్జనం జరిగేలా సహకరించాలని కోరారు.
"నగరంలో ఖైరతాబాద్ బడా గణేశ్ సహా, వినాయక నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. రాష్ట్రంలో మొదటిసారి వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్‌ను అందించాము. నగరంలో వినాయక నవరాత్రులు విజయవంతంగా ముగిశాయి. ట్యాంక్‌బండ్ చుట్టూ 135 క్రేన్లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 360 క్రేన్లను వినాయక నిమజ్జనాలకు ఏర్పాటు చేశాము. నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భక్తులు సహకరించాలని కోరుతున్నాం". - పొన్నం ప్రభాకర్, మంత్రి
గంగమ్మ ఒడికి 2 వేల గణనాథులు- కోలాహలంగా కేసీ కెనాల్ - Lord Ganesh Immersion Celebrations
ఖైరతాబాద్ గణేశ్‌ను నిమజ్జనానికి తరలించడానికి మచిలీపట్నంకు చెందిన టస్కర్ ఖైరతాబాద్‌కు చేరుకుంది. ప్రస్తుతం మహా గణపతి శోభాయాత్ర కోసం టస్కర్‌పై వెల్డింగ్ పనులు జరుగుతున్నాయి. 40 టన్నుల ఖైరతాబాద్ వినాయకుడిని టస్కర్ పైకి ఎక్కించడానికి దాదాపుగా గంట సమయం పడుతుంది. సెప్టెంబర్ 17న ఉదయం 6 గంటలకే పూజలు అన్ని పూర్తి చేసుకొని తరలించే విధంగా ప్రణాళిక సిద్దం చేశారు.
70 అడుగుల ఎత్తుతో కొలువైన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని ఈసారి అత్యంత ఆకర్షణీయ రూపంతో తీర్చిదిద్దారు. గణపతిపై మండపంపై స్వామికి ఓ వైపు రాహుకేతువు, మరోవైపు అయోధ్య బాలరాముడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఉక్కు, మట్టితో చేసిన ఈ భారీ విగ్రహం మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకు శోభాయాత్ర నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తిచేశారు. ఖైరతాబాద్ , టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి సెక్రటేరియట్ మీదుగా సాగర తీరానికి స్వామివారు తరలి రానున్నారు. మధ్యాహ్నం 1.30 లోపు నిమజ్జనం పూర్తి అవుతుందని అధికారులు పేర్కొన్నారు. నిమజ్జన సమయంలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మేయర్ ప్రత్యేక పూజలు : మరోవైపు ఖైరతాబాద్ శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి దర్శించుకున్నారు. స్వామి వారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం గద్వాల విజయలక్ష్మిని కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మేయర్, నిమజ్జనం కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో పూర్తి స్తాయిలో ఏర్పాట్లు చేశామన్నారు. నిమజ్జనం సాఫీగా సాగేందుకు ఎక్కడికక్కడ బేబీ పాండ్‌లను ఏర్పాటు చేశామన్నారు. 15 రోజులుగా నిమజ్జనం ఏర్పాట్ల కోసం పని చేస్తున్నట్టు వివరించారు.
చెవిలో కోరికలు చెబితే తీర్చే వినాయకుడు - ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా! - Vinayaka Chavithi utsavalu