30 Crore Investment Fraud in Nalgonda District : రూ.30 కోట్లు మోసం చేసి తనపై తానే పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో చోటుచేసుకుంది. వివారాల్లోకెళ్తే నల్గొండ చింతపల్లి మండలానికి చెందిన మనీష్ రెడ్డి నాలుగేళ్ల క్రితం మనీష్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడర్స్ పేరిట ఆఫీస్ తెరిచాడు. అందులో వందకు రెండు వందలు, వేయికి రెండు వేలు, లక్షకు రెండు లక్షలు అంటూ డబుల్ ధమాకా స్కీమ్ ప్రారంభించాడు.
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ ఆశ చూపించాడు. మొదట్లో చెప్పిన విధంగానే పెట్టుబడిదారులకు సమయానికి వడ్డీ చెల్లించాడు. తర్వాత ఏకంగా 10మంది ఏజెంట్లను పెట్టుకుని వారికి నెలకు రూ.16వేల జీతం ఇస్తూ టార్గెట్ పెట్టుకుని మండలంతో పాటు మర్రిగూడ, యాచారం, ఇబ్రహీంపట్నం, కరీంనగర్, నిజామాబాద్, చౌటుప్పల్, హైదరాబాద్ వరకు విస్తరించాడు. మనీష్ రెడ్డి ట్రాప్‌లోకి సామాన్యులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేరారు.
వేధింపులు తాళలేక తనపై తానే ఫిర్యాదు : దురాశ దుఃఖానికి చేటు అన్న విధంగా ఆలోచించకుండా కొందకు వేలల్లో పెట్టుబడి పెడితే మరికొందరు లక్షల్లో పెట్టుబడి పెట్టారు. సుమారు 200 మంది దగ్గర నుంచి సుమారు రూ.30 కోట్లు వసూలు చేశాడు. కొంతకాలం తర్వాత లోన్లు ఇస్తానంటూ నమ్మించాడు. ఆ తర్వాత అదిగో ఇదిగో అంటూ మాట మార్చాడు. అలా 7నెలలు తప్పించుకుని తిరిగాడు. అనుమానం వచ్చిన గ్రామస్థులు అతనిపై ఒత్తిడి పెంచారు. అలా కాదని స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనపై కేసు నమోదు చేసి జైలుకి పంపాలని, గ్రామస్థుల వేధింపులు భరించలేకపోతున్నానంటూ విచిత్రంగా తనపై తానే ఫిర్యాదు చేసుకున్నాడు.
కావాలంటే నన్ను చంపేయండి : విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి వచ్చి వడ్డీ లేకపోయినా ఫర్లేదు అసలు ఇవ్వమని అడగ్గా తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని కావాలంటే జైల్లో పెట్టుకుంటారా, చంపేస్తారా చంపేయండి అంటూ దబాయించాడు. చేసేదేమి లేక గ్రామస్థులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వద్దు అనుకుని పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకుందామని గ్రామానికి తీసుకువచ్చారు. అక్కడికి తీసుకొచ్చాక డబ్బులు అడగ్గా తన దగ్గర ఒక్క రుపాయిలేదని గ్రామస్థుల వేధింపులు భరించలేకనే తనపై తాను కేసు పెట్టుకున్నానని చెప్పాడు. దీంతో గ్రామస్థులు ముక్కున వేలేసుకున్నారు.
"ఈ కేసులో చీటింగ్ కేసు, డిపాజిటర్ యాక్ట్ కింద కేసు బుక్ చేశాం. మనీష్ అనే వ్యక్తి కొంతకాలంగా తన దగ్గర డిపాజిట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపించాడు. దీంతో చాలామంది అందులో పెట్టుబడి పెట్టారు. ఏజెంట్లను నియమించుకుని మొదట్లో రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు సేకరించి వడ్డీలు చెల్లించాడు. దీంతో మళ్లీ అధిక మొత్తంలో పెట్టబడులు పెట్టారు. డబ్బులు ఏం చేశాడు అన్నదానిపై విచారణ చేస్తున్నాం." - గిరిబాబు, డీఎస్పీ
మరోవైపు నిందితుడు తనపై తాను పెట్టకున్న కేసుపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. స్కీమ్‌లో ఎంత మంది పని చేశారు. ఇంకెవరెవరు ఉన్నారు అన్నదానిపై కూపీ లాగుతున్నారు. మనీష్ సంస్థ ద్వారా ఎవరైనా బాధితులు ఉంటే వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అయితే ఈ స్కీమ్‌లో అత్యధికంగా ఇద్దరు బ్యాంకు ఉద్యోగస్థులు పెట్టుబడిపెట్టినట్లు తెలిపారు. ఒకరు రూ.60లక్షలు పెట్టగా మరొకరు రూ.10లక్షలు పెట్టారు.
అధిక వడ్డీ ఆశ చూపించారు - సొమ్ము చెల్లించాక బోర్డు తిప్పి ఉడాయించారు