AMARAVATHI BUDGET ALLOCATION 2024 : కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వరాల జల్లు కురిసింది. పద్దులో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామన్న నిర్మలమ్మ, పోలవరానికి కావాల్సిన నిధులు కేటాయించినట్లు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులకు జీవనాడి పోలవరం ప్రాజెక్టు అని వ్యాఖ్యానించిన ఆమె, భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైందన్నారు.
రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం అందిస్తున్నాం. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తాం. విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తాం. పోలవరానికి కావాల్సిన నిధులు కేటాయించాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులకు జీవనాడి పోలవరం ప్రాజెక్టు. భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైంది. - నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
కొత్తగా ఉద్యోగంలో చేరితే నెల జీతం బోనస్- ఐదేళ్లలో 4.1 కోట్ల మందికి ఉపాధి! - Union Budget 2024
వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ : మరోవైపు విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందించనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం ఇవ్వనున్నామని, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేలకు నిధులు అందిస్తామని తెలిపారు. విశాఖ-చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామన్నారు. వీటితో పాటు ఏపీలోని వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ అందజేస్తామన్న నిర్మలమ్మ, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇవ్వనున్నట్లు సభా వేదికగా ప్రకటించారు.
9 ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్ : కేంద్ర ప్రభుత్వం 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ప్రాధాన్య అంశాలను ఎంపిక చేసుకుంది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన - నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, ఆవిష్కరణలు - సంస్కరణలు - ఈ తొమ్మిది అంశాలు ప్రాధాన్యంగా తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతూ, ఈ అంశాలను ప్రకటించారు.