WTC 2025 Points Table India: ఇంగ్లాండ్‌పై రెండో టెస్టులో విజయం సాధించిన భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1 సమం చేసింది. ఈ టెస్టులో ఇంగ్లాండ్‌పై 106 పరుగుల నెగ్గండం వల్ల సిరీస్‌ను సమం చేయడమే కాకుండా ప్రపంచటెస్టు ఛాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలోనూ భారత్ మెరుగైన స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం 52.77 శాతంతో భారత్ రెండో ప్లేస్‌లో కొనసాగుతోంది. ఇప్పటివరకు డబ్ల్యూటీసీ- 25లో 6 మ్యాచ్‌లు ఆడిన టీమ్ఇండియా 3టెస్టుల్లో నెగ్గి, రెండింట్లో ఓడగా, ఒకటి డ్రా చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 55.00 శాతంతో టాప్‌లో ఉంది.
కాగా, రెండో స్థానంలో ఉండగానే భారత్ ఈ సిరీస్ ప్రారంభించింది. అయితే తొలి టెస్టు మ్యాచ్‌లో ఓటమి కారణంగా ఆరో ప్లేస్‌కు పడిపోయింది. ఇక తాజా విజయంతో మళ్లీ టాప్- 2లోకి దూసుకొచ్చింది. ఇక సౌతాఫ్రికా (50.00శాతం), న్యూజిలాండ్ (50.00 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లాండ్ కేవలం 25.00 శాతంతో ఎనిమిదో స్థానంలో ఉండగా, శ్రీలంక ఈ టోర్నీ సైకిల్లో ఇప్పటివరకు విజయమే నమోదు చేయాకుండా 0 శాతంలో చిట్ట చివరగా ఉంది. కాగా, 2025 మార్చి నాటికి ఈ టేబుల్లో టాప్- 2లో ఉన్న జట్ల మధ్య ఫైనల్ జరుగుతుంది.
అయితే డబ్ల్యూటీసీ గత రెండు సీజన్ (2019-21, 2021-23)లోనూ భారత్ అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్ వరకూ చేరుకుంది. ఇక తొలి సీజన్లో న్యూజిలాండ్‌తో తుదిపోరులో భంగపడ్డ టీమ్ఇండియా, 2023 జూన్‌లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. దీంతో ఈసారైనా డబ్ల్యూటీసీ 'గద' నెగ్గాలన్న పట్టుదలతో ఉంది భారత్.
Ind vs Eng Test Series 2024: ఇక భారత్- ఇంగ్లాండ్ సిరీస్ విషయానికొస్తే, హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విజయం అంచులదాకా వచ్చి (28 పరుగుల తేడా) ఓడింది. దీంతో విశాఖపట్టణం వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ పట్టుదలతో పోరాడింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థి బజ్‌బాల్ వ్యూహానికి కళ్లెం వేసి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 15న మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు రాజ్‌కోట్ స్టేడియం వేదిక కానుంది.