Harbhajan Singh On Indian Captaincy: టీమ్ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ భారత టీ20 జట్టు కెప్టెన్సీ విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ శర్మ తర్వాత టీ20 ఫార్మాట్ బాధ్యతలు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు అప్పగించాలని అన్నాడు. రాజస్థాన్ తాజాగా ముంబయిపై విజయం సాధించిన తర్వాత హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'వికెట్ కీపింగ్ కమ్ బ్యాటింగ్ విషయంలో డిబేట్ అనవసరం. టీ20 వరల్డ్‌కప్‌లో సంజూ శాంసన్ స్థానం ఉంటుంది. ఇక రోహిత్ తర్వాత టీ20 ఫార్మాట్లో టీమ్ఇండియాను నడిపించే సత్తా శాంసన్‌కు ఉంది' అని భజ్జీ అన్నాడు. ఇక సోమవారం ముంబయి- రాజస్థాన్ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్‌ను కూడా భజ్జీ ప్రశంసించాడు. 'ఫామ్ టెంపరరీ, క్లాస్ పర్మనెంట్ అని జైస్వాల్ తాజా ఇన్నింగ్స్‌తో నిరూపించాడు' అని ముంబయితో మ్యాచ్ అనంతరం భజ్జీ ట్వీట్ చేశాడు.
ఇక ప్రస్తుత ఐపీఎల్లో రాజస్థాన్ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ఆల్‌రౌండ్ విభాగాల్లో సమష్ఠిగా రాణిస్తూ, నిలకడగా విజయాలు సాధిస్తోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన రాజస్ధాన్ కేవలం ఒకదాంట్లోనే ఓడి, 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఫలితంగా 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, ముంబయి నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 18.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో యువ సంచలనం రాజస్థాన్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ శతకంతో (104* పరుగులు,60 బంతుల్లో, 9x4, 7x6) అదరగొట్టాడు. మరో ఓపెనర్ బట్లర్ (35 పరుగులు), సంజూ శాంసన్ (38* పరుగులు) రాణించారు.