Teamindia Independence Day: 78వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు దేశం సిద్ధమైంది. 1947న భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత టీమ్ ఇండియా క్రికెట్‌లో గణనీయమైన వృద్ధి సాధించింది. ఇప్పుడు క్రికెట్ ప్రపంచానికే పెద్దన్నలా వ్యవహరిస్తోంది. గత 78ఏళ్లలో క్రికెట్‌లో భారత్ గణనీయమైన వృద్ధిని సాధించింది. దేశ క్రీడా రంగం క్రికెట్ కేంద్రంగా మారిపోయింది. భారత క్రికెట్ భారీ పురోగతిని సాధించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేళ భారత క్రికెట్‌లో సాధించిన అద్భుత విజయాలను ఓసారి గుర్తుచేసుకుందాం.
టెస్టుల్లో తొలి విజయం
అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌కు తొలి విజయం 1952 ఫిబ్రవరి 10న దక్కింది. చెన్నై చెపాక్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో వెనుకంలోకి వెళ్లినా, ఐదో మ్యాచ్‌లో భారత్ విజయం కోసం పట్టుదల ప్రదర్శించింది. వినూ మన్కడ్ 12 వికెట్లు పడగొట్టడం వల్ల భారత్ ఇన్నింగ్స్, 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.
క్రికెట్ చరిత్రను మార్చిన విజయం
1983లో భారత్ తొలి ప్రపంచకప్ టైటిల్‌ను సాధించి విశ్వ విజేతగా ఆవిర్భవించింది. తొలి ప్రపంచ కప్ విజయం భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన క్షణాలలో ఒకటి. జూన్ 25న కపిల్ దేవ్ సారథ్యంలోని జట్టు వెస్టిండీస్‌ను 43 పరుగుల తేడాతో లార్డ్స్‌లో ఓడించి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఈ అనూహ్య విజయంతో భారత క్రికెట్‌లో కొత్త శకం ఆరంభమైంది.
ప్రపంచ ఛాంపియన్లపై విజయం
2001లో వరుస విజయాలతో దూకుడు మీదున్న ఆస్ట్రేలియాకు భారత్ కళ్లెం వేసింది. భారత క్రికెట్ చరిత్రలో 2001 కోల్‌కతా టెస్టు ఒక కీలక మలుపు. 16 మ్యాచ్‌లు వరుసగా గెలిచిన కంగారులపై భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. 233 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని పొందిన తర్వాత కూడా ఆస్ట్రేలియా పరాజయం పాలైంది. వీవీఎస్ లక్ష్మణ్ (281), రాహుల్ ద్రవిడ్ (180)ల రికార్డు ట్రిపుల్ సెంచరీ భాగస్వామ్యంతో కంగారులపై టీమ్ ఇండియా విజయం సాధించింది.
ధోనీ శకం ఆరంభం
2007లో తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను భారత్ ఒడిసిపట్టుకుంది. MS ధోని నాయకత్వంలో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి ICC T20 ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత జట్టు, ఫైనల్లో పాక్‌ను ఓడించి మరోసారి విశ్వ విజేతగా నిలిచింది.
2011 ప్రపంచకప్ విజయం
2011లో మరోసారి టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. ధోనీ సారథ్యంలో ఫైనల్లో శ్రీలంకను మట్టికరిపిస్తూ టీమ్ ఇండియా జగజ్జేతగా నిలిచింది. కెప్టెన్ ధోనీ సిక్స్ కొట్టి మ్యాచ్‌ను గెలిపించిన క్షణాలు భారత క్రికెట్ చరిత్రలో కలకాలం నిలిచే ఉంటాయి.
2021 గబ్బా గడ్డపై భారత్ సత్తా
2021లో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో గబ్బా టెస్ట్‌లో భారత్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. గబ్బా పిచ్‌పై టీమ్ఇండియా 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. రిషబ్ పంత్ (89*), శుభ్‌మన్ గిల్ (91) వీరోచితంగా పోరాడి భారత్‌కు విజయాన్ని అందించారు.
రెండో టీ20 టైటిల్
తాజాగా అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ 20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఛాంపియన్‌గా నిలిచింది. రోహిత్ శర్మ సారథ్యంలో ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేస్తూ భారత జట్టు మరోసారి విశ్వ విజేతగా నిలిచింది.
𝗖.𝗛.𝗔.𝗠.𝗣.𝗜.𝗢.𝗡.𝗦 🏆#TeamIndia 🇮🇳 HAVE DONE IT! 🔝👏
— BCCI (@BCCI) June 29, 2024
ICC Men's T20 World Cup 2024 Champions 😍#T20WorldCup | #SAvIND pic.twitter.com/WfLkzqvs6o
దులీప్ ట్రోఫీ టీమ్ఇండియా స్క్వాడ్ - రోహిత్, కోహ్లీ ఔట్ - Duleep Trophy 2024