T20 Worldcup 2024 Teamindia VS Australia : టీ20 వరల్డ్ కప్ 2024లో రోహిత్ సేన సూపర్-8 స్టేజిలోని చివరి మ్యాచ్ ఆడనుంది. డారెన్ సామీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టీమిండియా ఓటమి లేకుండా వరుస విజయాలతో దూసుకెళ్తూ దాదాపు సెమీస్‌లో బెర్త్ ఖాయం చేసుకున్నట్లు కనిపిస్తున్న వేళ ఆస్ట్రేలియా జట్టుకు తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఐసీసీ ఈవెంట్లలో చాలా సార్లు కంగారూల చేతిలో ఓటమిని ఎదుర్కొన్న టీమిండియా ప్రత్యర్థి జట్టును అంత తక్కువ అంచనా వేయకూడదు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆసీస్‌ను ఇంటికి పంపేయొచ్చు. గత మ్యాచ్‌లో బంగ్లాపై బ్యాటింగ్ విభాగంతో పాటు బౌలర్లు బుమ్రా, అర్ష్‌దీప్ కుల్దీప్‌లు చెలరేగడంతో ఘన విజయాన్ని నమోదు చేయగలిగారు. రోహిత్, విరాట్ లయ అందుకుని మంచి శుభారంభాన్ని నమోదు చేయడం జట్టుకు సానుకూలాంశం. అఫ్గాన్ పై జరిగిన మ్యాచ్‌లో శివమ్ దూబె కీలక దశలో నిలబడ్డాడు. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ టోర్నీ ఆరంభం నుంచి మంచి ఫామ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాట్, బాల్ రెండింటితోనూ జట్టుకు బలంగా మారాడు. జట్టులో లోపాలేమీ కనిపించకపోవడంతో అదే తుది జట్టుతో ఆసీస్‌పై తలపడేలా కనిపిస్తుంది. అయినప్పటికీ ఎక్స్‌ట్రా బ్యాటర్ కింద జడేజాను పక్కకుపెట్టి సంజూ శాంసన్‌ను ఆడించే ఆస్కారముంది.
కంగారులో కంగారూలు - సెమీ ఫైనల్ ఆశలు నిలుపుకునేందుకు ఆసీస్ జట్టు గందరగోళంలో పడింది. బంగ్లాదేశ్‌పై గెలిచినా అఫ్గానిస్థాన్ చేతిలో ఓడి సమస్యల్లో పడింది. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ విభాగంలో ఫెయిల్ అయి కేవలం 149 పరుగులకే చాప చుట్టేసింది. హెడ్, వార్నర్, మ్యాక్స్‌వెల్‌ల పైనే ఆశలు పెట్టుకోవడం నిరుత్సాహానికి గురి చేసింది. ఈ కీలక దశలో కెప్టెన్ మార్ష్ ఫామ్ అందుకోవడం ఆసీస్‌కు చాలా కీలకం. అఫ్గానిస్థాన్‌తో జరిగిన గేమ్‌లో అగర్‌ను తీసుకున్న ఆసీస్ మళ్లీ అతని స్థానంలో స్టార్క్ లేదా హాజిల్ వుడ్‌కు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుణుడు కనికరిస్తే మ్యాచ్ సజావుగా సాగుతుంది. అక్కడి వాతావరణాన్ని బట్టి వర్షం పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
తుది జట్లు:
టీమిండియా : విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ( కెప్టెన్), రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్సర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
ఆసీస్ టీమ్ : ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోనిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వడె, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా, జోష్ హ్యాజిల్ వుడ్/ఆష్టన్ అగర్.
టీ20 ప్రపంచకప్ - ఆసక్తికరంగా సమీకరణాలు - T20 Worldcup 2024
సూపర్ 8లో రోహిత్ సేన దూకుడు-హ్యాట్రిక్ విన్ కోసం ఎదురుచూపు!