T20 World Cup 2024 Teamindia Squad : బీసీసీఐ సెలక్షన్ కమిటీ రాబోయే వరల్డ్ కప్ టీ20 సమరానికి ప్లేయర్లను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ 30న ప్రకటించిన 15 మంది ప్లేయర్ల బృందంలో కొందరు కీలక ప్లేయర్లు చోటు దక్కించుకోలేకపోయారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు యథాస్థానాన్ని కొనసాగిస్తూ అలానే సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్ వంటి ప్లేయర్లకు అవకాశం కల్పించారు. అయితే ప్రతిభావంతమైన కొంతమంది ప్లేయర్లను పక్కకుపెట్టడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అయినప్పటికీ ప్రస్తుతం ఎంచుకున్న జట్టుపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇంతకీ చోటు కోల్పోయిన వారు ఎవరంటే?
శుభ్‌మన్ గిల్ - వరల్డ్ కప్‌లో స్థానం కోసం ఎదురుచూసిన టీమ్ ఇండియా స్టార్, యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు నిరాశే ఎదురైంది. ప్రపంచ కప్ ప్రధాన జట్టులో చోటు దక్కలేదు. గిల్ రిజర్వు ప్లేయర్ల లిస్టులో మాత్రమే ఉన్నాడు. ఎవరైనా ప్లేయర్ గాయపడితేనే తప్ప అతడికే ఆడే అవకాశం రాకపోవచ్చు. గిల్ భారత్ తరఫున 14 టీ20ల్లో 147 స్ట్రైక్ రేట్‌తో 335 పరుగులు చేశాడు. 100 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 3094 పరుగులు కొట్టాడు. అయితే అతడు ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ బ్యాట్‌తో అంతగా రాణించలేకపోవడమే వరల్డ్ కప్ టీ20 జట్టులో చోటు దక్కనివ్వకుండా చేసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రుతురాజ్ గైక్వాడ్ - చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సీజన్ ఆరంభమైన నాటి నుంచి బ్యాటింగ్‌తో చక్కటి ప్రదర్శన కనబరిచాడు. సెంచరీలతో జట్టుకు స్కోరును బలపరుస్తున్న గైక్వాడ్ టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోకపోవడం షాకింగ్ అంశమే. ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగానూ అతడు కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసి 447 పరుగులు చేశాడు.
కేఎల్ రాహుల్ - లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ సీజన్లో అద్భుతంగానే రాణిస్తున్నాడు. కానీ గాయం కారణంగా అతడు కొంతకాలం జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే అతడికి పోటీగా ఉన్న సంజూ శాంసన్‌కు చోటు దక్కింది.
రవి బిష్ణోయ్ - చాలాకాలంగా ఇండియన్ జట్టులో కొనసాగుతున్న చాహల్‌కు బదులుగా రవి బిష్ణోయ్‌ను తీసుకుంటారని వార్తలు చక్కర్లు కొట్టాయి. కుల్దీప్ యాదవ్‌తో కలిసి రవి బిష్ణోయ్ జోడీ కడతాడని ఊహించిన వాళ్లందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ చాహల్‌కే మరోసారి ప్రాధాన్యమిచ్చారు సెలక్టర్లు.
ముఖేశ్ కుమార్ - జనవరిలో జరిగిన టీ20 సిరీస్‌లో ఈ పేసర్ మంచి ప్రదర్శనే కనబరిచాడు. కానీ, పేస్ బౌలింగ్ విభాగంలో కొన్నేళ్లుగా కొనసాగుతున్న వారికే మొగ్గు చూపుతూ ముఖేశ్ కుమార్‌ను పక్కకుపెట్టేశారు.
రింకూ సింగ్ - అందరూ ఊహించినట్లుగా రింకూ సింగ్‌కు అవకాశం దక్కలేదు. అయితే అతని స్థానంలో పవర్ హిట్టర్ శివమ్ దూబెకు స్థానం కల్పించారు. 15 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన రింకూ, 89 సగటుతో 356 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇంపాక్ట్ ప్లేయర్ అతడి అవకాశాన్ని దెబ్బతీసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, ఐసీసీ గైడ్ లైన్స్ ఆధారంగా జట్లన్నీ మే25లోపు తమ జట్లలో మార్పులు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏదైనా మార్పులు చేయాలని భావిస్తే ఐసీసీ ఈవెంట్ టెక్నికల్ కమిటీ నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది.
భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్
రిజర్వ్‌డ్ : శుభ్‌మన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్
వారిదే కీలక పాత్ర - ఐపీఎల్లో ప్రపంచకప్ జట్టు ప్రదర్శన ఎలా ఉందంటే? - T20 world cup 2024