Sports Personalities Who Fought With Cancer : ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఇప్పటికీ ఆ వ్యాధితో పోరాడేవారు ఎందరో ఉన్నారు. అయితే కొందరు మాత్రం దాన్ని అధిగమించి మళ్లీ మనముందుకొచ్చారు. అలాంటి వారిలో ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారు. వారు మైదానంలోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ అనేక సవాల్‌ను ఎదుర్కొని క్యాన్సర్‌ను జయించారు. వారెవరు. వారి ఇన్స్పిరేషనల్ జర్నీ గురించి తెలుసుకుందామా?
లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్
1996లో ఆర్మ్‌స్ట్రాంగ్ క్యాన్సర్ బారినపడ్డారు. 25 ఏళ్ల వయసులో వృషణ క్యాన్సర్‌తో (Testicular cancer) బాధపడ్డారు. అది ఆయన ఊపిరితిత్తులు, కడుపు, మెదడుకు కూడా వ్యాపించింది. దీంతో శస్త్రచికిత్స తర్వాత కూడా ఆయన బతికే అవకాశాలు 40 శాతం కంటే తక్కువగా ఉన్నాయంటూ వైద్యులు చెప్పేశారు. కానీ ఆర్మ్‌స్ట్రాంగ్ మాత్రం ఏ మాత్రం కుంగిపోకుండా క్యాన్సర్‌ను జయించి 1999, 2005లో టూర్ డి ఫ్రాన్స్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించి చరిత్రలో గొప్ప సైక్లిస్ట్‌లలో ఒకరిగా చరిత్రకెక్కారు.
లియాండర్ పేస్
స్టార్ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్‌కు 2003లో మెదడు ఎడమ భాగంలో సుమారు 4 మిల్లిమీటర్ల తిత్తి(cyst) ఉండగా, అది క్యాన్సర్ ఇన్‌ఫెక్షన్ అని తేలింది. అయినప్పటికీ పేస్ కోలుకుని మళ్లీ రాకెట్ చేతపట్టాడు. మార్టినా నవ్రతిలోవాతో కలిసి 2004 ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌కు చేరుకున్నాడు.
యువరాజ్ సింగ్
క్రికెట్ వన్డే ప్రపంచ కప్ 2011 తర్వాత యువరాజ్ సింగ్ సెమినోమా అనే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడ్డాడు. అనంతరం చికిత్స తీసుకుని దాన్ని జయించాడు. ఆ తర్వాత 2017లో భారత్ తరఫున ఆడేందుకు తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు YouWeCan అనే ఫౌండేషన్‌ను స్థాపించి దాని ద్వారా క్యాన్సర్ రోగులకు చికిత్స అందిస్తున్నాడు.
Merry Christmas from our Santa family to yours 🎅 Wishing everyone love, laughter, and the warmth of loved ones ❤️ @hazelkeech pic.twitter.com/emeN9ASa2Q
— Yuvraj Singh (@YUVSTRONG12) December 25, 2023
ఎరిక్ అబిడాల్
2011లో ఫ్రాన్స్‌కు చెందిన ఈ ఫుట్‌బాలర్ తన క్యాన్సర్ కణతిని శస్త్రచికిత్స ద్వారా తొలగించుకున్నాడు. ఎన్నో సమస్యలను జయించి కేవలం రెండు నెలల తర్వాత, మాంచెస్టర్ యునైటెడ్‌తో జరిగిన ఛాంపియన్స్ లీగ్ ఫైనల్‌లో బార్సిలోనాకు ప్రాతినిధ్యం వహించాడు. అతడి సహచరులు అబిడాల్‌కు కెప్టెన్ ఆర్మ్‌బ్యాండ్ ఇవ్వడమే కాకుండా ఆ ట్రోఫీని ఎత్తే అవకాశాన్ని కూడా ఇచ్చారు.
సైమన్ ఓ'డొన్నెల్
1987లో ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచ కప్ విజయం సాధించిన తర్వాత ఆల్ రౌండర్ సైమన్ ఓ'డొనెల్ క్యాన్సర్ బారినపడ్డాడు. అయితే దాన్ని జయించి డొన్నెల్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేశాడు. అంతేకాకుండా కేవలం 18 బంతుల్లోనే వన్డేల్లో అత్యంత వేగంగా 50 పరుగులు చేసి రికార్డుకెక్కాడు. 1993 వరకు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.
ఎడ్నా క్యాంప్‌బెల్
ఎడ్నా క్యాంప్‌బెల్ మహిళల బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి, రొమ్ము క్యాన్సర్‌తో బాధపడ్డ క్యాంప్‌బెల్ దాన్ని జయించితర్వాత చాలా ఏళ్లపాటు బాస్కెట్‌బాల్ ఆడింది.
మైక్ లోవెల్
అమెరికా బేస్‌బాల్ ఆటగాడైన మైక్ లోవెల్‌కు రెండు సార్లు క్యాన్సర్ సోకింది. ఆ రెండుసార్లు వ్యాధిని జయించిన లోవెల్ 12 ఏళ్లపాటు మూడు ప్రపంచ సిరీస్ టైటిళ్లను గెలుచుకున్నాడు.
లూయిస్ వాన్ గాల్
నెదర్లాండ్స్ మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు, కోచ్ లూయిస్ వాన్ గాల్ 2022లో తనకు క్యాన్సర్ ఉందని వెల్లడించడం క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ప్రోస్టేట్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్న తర్వాత ప్రపంచ కప్‌లో రెండోసారి నెదర్లాండ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
మార్టినా నవ్రతిలోవా
టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా తాను గొంతు, రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. 66 ఏళ్ల ఈ టెన్నిస్ ప్లేయర్ ఎన్నో టైటిళ్లను సాధించింది.
మాథ్యూ వేడ్
ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్, మాథ్యూ వేడ్‌కు కూడా 16 ఏళ్ల వయసులో వృషణ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది, అయినా అతను రెండు రౌండ్ల కీమోథెరపీ చికిత్స తర్వాత కోలుకున్నాడు. తర్వాత జాతీయ జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు.