Sarfaraz Khan Sunil Gavaskar : ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రత్యర్థులను కట్టడి చేస్తూ మంచి స్కోర్‌ను అందుకున్నాడు. అయితే, రెండో రోజు మూడో సెషన్ ప్రారంభమైన తర్వాత, తొలి బంతికే పెవిలియన్ బాట పట్టాడు.షోయబ్ బషీర్ వేసిన బంతి అనూహ్యంగా బౌన్స్ అవ్వగా, దాన్ని ఆడే క్రమంలో స్లిప్‌లో జో రూట్ చేతికి చిక్కాడు.
అయితే సర్ఫరాజ్ ఔట్ అయిన తీరు పట్ల టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రీజులో కుదరుకున్నాక ఇలా ఔట్ కావడం ఎలాంటి బ్యాటర్‌కైనా బాధగానే ఉంటుందని, ఇలాంటి సమయంలోనే సర్ డాన్ బ్రాడ్‌మన్ చెప్పిన విషయాలు తనకు గుర్తుకొస్తున్నాయని గావస్కర్ వెల్లడించాడు.
"బంతి పిచ్‌పై పడిన లేచిన తర్వాత, ఆ షాట్ కొట్టేందుకు అనువుగా పైకి లేవలేదు. దాన్ని ఆడేందుకు ప్రయత్నించి బ్యాటర్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. టీ బ్రేక్ తర్వాత తొలి బంతినే అతడు ఇలా ఆడాడు. అటువంటి సమయంలో కాస్త బంతిపై దృష్టి పెట్టుంటే బాగుండేది. సర్ఫరాజ్ ఔటైన సమయంలో నాకు సర్ డాన్ బ్రాడ్‌మన్ గుర్తుకొచ్చారు. ప్రతి బంతిని నేను ఎదుర్కొనే దృక్కోణం ఒకేలా ఉంటుంది. ఒకవేళ నేను 200 స్కోరు మీద ఉన్నా సరే, ఆ తర్వాతి బంతిని ఎదుర్కొనేటప్పుడు నేను '0' మీదే ఉన్నాననుకొని ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తాను అంటూ ఆయన చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయి. ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ అనసవరమైన షాట్‌తో వికెట్‌ను సమర్పించాడు. అది కూడా సెషన్ ప్రారంభమైన తొలి బంతికే ఔట్ కావడం బాధాకరంగా ఉంది" అంటూ గావస్కర్ తెలిపాడు.
ఇక మ్యాచ్ విషయానికి ఐదో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 255 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 218 పరుగులకు ఆలోటవ్వగా, రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 473/8 స్కోరుతో నిలిచింది. ఇంగ్లాండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ (4/170) నాలుగు వికెట్లు తీసినప్పటికీ, భారత జట్టును నియంత్రించలేకపోయాడు. ప్రస్తుతం క్రీజ్‌లో కుల్‌దీప్ యాదవ్ (27*), బుమ్రా (19*) ఉన్నారు.
'క్రికెటర్లలో అతడొక చెస్ ప్లేయర్‌గా అనిపిస్తాడు'- అశ్విన్‌పై చెస్ దిగ్గజం ప్రశంసలు