Ranji Trophy BCCI Hike Match Fees : రెడ్ బాల్ క్రికెట్ పై ఆటగాళ్లకు ఆసక్తిని పెంచేందుకు బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే. టీమ్ ఇండియాలోకి తిరిగి రావాలంటే రంజీల్లో ఆడాలన్న క్రికెట్ బోర్డు ఆదేశాలను ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లు తిరస్కరించిన విషయం తెలిసిందే. బీసీసీఐ ఆదేశాలను భేఖాతర్ చేసిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ రంజీల్లో ఆడకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అయ్యర్ వెన్ను గాయం అయ్యిందంటూ సాకు చెప్పి ఏన్సీఏలోనే ఉండిపోతే ఇషాన్ కిషన్ అయితే రంజీల్లో ఆడకుండా ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీంతో వీరిద్దరి వ్యవహారం బీసీసీఐకి కోపం తెప్పించింది. వీరిద్దరిపై బీసీసీఐ పెద్దలు ఫైర్ అవుతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే రెడ్ బాల్ క్రికెట్ పై ఆటగాళ్లకు మరింత ఇంట్రెస్ట్ పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకునే దిశగా బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆటగాళ్ల టెస్టు మ్యాచ్ ఫీజులను కూడా పెంచే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు ఓ జాతీయ వార్త సంస్థ తమ కథనంలో పేర్కొంది.
"ఏ ఆటగాడు అయినా సరే క్యాలెండర్ సంవత్సరంలో అన్ని టెస్ట్ సిరీస్‌ల్లోనూ ఆడితే, అతనికి వార్షిక రిటైనర్ కాంట్రాక్ట్ కాకుండా అదనంగా రివార్డ్ ఇవ్వాలని నిర్ణయించాం. ఆటగాళ్ళు రెడ్ - బాల్ క్రికెట్‌పై మరింత ఆసక్తి చూపేలా ప్రణాళికలు రచిస్తున్నాాం. మ్యాచ్ ఫీచ్ కూడా పెంచనున్నాం. ఈ నిర్ణయంతో టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ఆటగాళ్లు ఇంట్రెస్ట్ చూపుతారని బీసీసీఐ భావిస్తోంది" అని ఓ బోర్డు అధికారి తెలిపారు.
అయితే బీసీసీఐ ప్రస్తుతం ఒక్కో టెస్టు మ్యాచ్‌కు ఫీజు రూ. 15లక్షలు, వన్డేలకు రూ.6లక్షలు, టీ20 మ్యాచ్‌లకు రూ.3లక్షలు చెల్లిస్తోంది. అయితే ఇప్పుడు టెస్టు మ్యాచ్‌కు ఏకంగా రూ. 20లక్షలు పెంచే విధంగా బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు పలు కథనాలు పేర్కొంటున్నాయి. అయితే కొత్త రెమ్యూనరేషన్ మోడల్ ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.