PBKS VS DC IPL 2024 : ఐపీఎల్లో భాగంగా పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. హోరా హోరీగా జరిగిన పోరులో గెలుపొందింది.
తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన పంజాబ్ జట్టు 19.2 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక సామ్ కరన్ (63) అర్ధ శతకం బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మిగతా ప్లేయర్లు కూడా రెండు అంకల స్కోర్ చేసి జట్టును ముందుకు నడిపించారు. శిఖర్ ధావన్ (22), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (26) పరుగులు సాధించారు. అయితే బెయిర్ స్టో (9), జితేశ్ శర్మ(9) మాత్రం పేలవ ఫామ్‌తో విఫలమయ్యారు. అయితే లివింగ్‌స్టోన్ (38*), హర్‌ప్రీత్ బ్రర్ (2*) నాటౌట్‌గా నిలిచారు. మరోవైపు దిల్లీ బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 2, ఖలీల్ అహ్మద్ 2 పడగొట్టగా, ఇషాంత్ శర్మ ఓ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
దిల్లీ ధనాధన్ ఇన్నింగ్స్ - పంత్‌కు స్టాడింగ్ ఒవేషన్
తొలుత బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ జట్టు కూడా మెరుగ్గా ఆడింది. దీంతో మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (29), మిచెల్ మార్ష్ (20) తమ ఇన్నింగ్స్‌తో శుభారంభం అందించారు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ షై హోప్ (33) రాణించాడు. రిషభ్ పంత్ (18) పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అభిషేక్ పొరెల్ (32), కూడా మంచి ఫామ్ చూపించాడు. వరుసగా ఫోర్స్, సిక్సర్లు బాదాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2, హర్షల్ పటేల్ 2, రబాడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
అయితే దాదాపు 15 నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన రిషబ్ పంత్‌ను చూసి ఫ్యాన్స్ ఎమోషనలయ్యారు. అతడు క్రీజులోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో స్టేడియంలోని వారంతా ఒక్కసారిగా నిలబడ్డారు. అతడికి స్టాడింగ్ ఒవేషన్ ఇచ్చి చప్పట్లతో ఆహ్వానించారు. ఈ స్పెషల్ మూమెంట్‌తో మ్యాచ్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా మారింది.