Paris Olympics 2024 Live Streaming And Live Telecast : ఈ నెల 26న పారిస్ ఒలింపిక్స్ ఆరంభ సంబరాలు సీన్ నది ఒడ్డున అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకల కోసం ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు అధికారికంగా 26వ తేదీన ప్రారంభం కానుండగా అనధికారికంగా ఒక రోజు ముందే(జులై 25) భారత్ పాల్గొనే ఈవెంట్‌లు ఆరంభం కానున్నాయి. జూలై 25న ఆర్చరీ ప్రారంభం కానుంది.
100 బోట్లలో 10,500 మంది అథ్లెట్లు - అయితే సాధారణంగా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలను స్టేడియంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి సంప్రదాయానికి భిన్నంగా పారిస్ మీదగా ప్రవహించే సీన్ నది తీరంలో ఒలింపిక్స్ వేడుకల ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్నారు. అసలీ ఆరంభ వేడుకల్లో అథ్లెట్లు ట్రాక్ మీద పరేడ్ నిర్వహిస్తారు. కానీ ఈసారి సీన్ నదిలో బోట్ల మీద రానున్నారు. దాదాపు 10,500 మంది అథ్లెట్లు 100 బోట్లలో పరేడ్ నిర్వహిస్తారు.
వీరిపైనే ఆశలు - జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా, బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు సహా 117 మందితో కూడిన భారత బృందం ఈ ప్రతిష్ఠాత్మక క్రీడల్లో పాల్గొననుంది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి- చిరాగ్ శెట్టి, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుపై ఈ ఒలింపిక్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. జూలై 27, శనివారం న్యూజిలాండ్‌తో భారత పురుషుల హాకీ జట్టు మొదటి మ్యాచ్ ఆడనుంది. బ్యాడ్మింటన్, బాక్సింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్ ఈవెంట్‌లు కూడా అదే రోజున ప్రారంభమవుతాయి.
ప్రారంభోత్సవ వేడుకలు ఎప్పుడు ప్రారంభం?
అక్కడి స్థానిక కాలమానం ప్రకారం జూలై 26న సాయంత్రం 7.30 గంటలకు ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు ప్రారంభమవుతాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 2 గంటలు వరకు ఈ వేడుకలు కొనసాగుతాయి.
భారత ఈవెంట్‌ల ఆరంభం ఎప్పుడంటే?
భారత్ తొలి ఈవెంట్ ఆర్చరీ మహిళల ర్యాంకింగ్ గ్రౌండ్ విభాగంలో జూలై 25 మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైంది.
ఎప్పటివరకూ కొనసాగుతాయి?
పారిస్ ఒలింపిక్స్ ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. ఈసారి మొత్తం 32 క్రీడాంశాల్లో 329 ఈవెంట్లు జరగనున్నాయి. 206 దేశాల నుంచి 10 వేల మందికిపైగా అథ్లెట్లు పాల్గొననున్నారు.
ఏయే వేదికల్లో జరుగుతాయ్?
పారిస్ ఒలింపిక్స్ పారిస్, ఫ్రాన్స్‌లోని 33 వేదికల్లో నిర్వహిస్తారు.
లైవ్ ఎక్కడ చూడాలంటే?
పారిస్ ఒలింపిక్స్ 2024 స్పోర్ట్స్ 18, వయాకామ్ 18 నెట్‌వర్క్ సంస్థలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. జియో సినిమా యాప్‌లో కూడా ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.
పారిస్ అతిథులకు స్పెషల్ ట్రీట్మెంట్ - 'ఇండియా హౌస్'లో ఏమున్నాయంటే? - Paris Olympic 2024
పారిస్ ఒలింపిక్స్‌లో 'మేడ్ ఇన్ ఇండియా'- అది తల్లీ, కుమార్తె ఘనతే! - Paris 2024 Olympics