Paris Olympics 2024 Ashwini Ponnappa : పారిస్ ఒలింపిక్స్ 2024లో కచ్చితంగా పతకాలు సాధిస్తారని ఆశించిన ఈవెంట్లలో బ్యాడ్మింటన్ కూడా ఒకటి. కనీసం ఒకటి లేదా రెండు మెడల్స్ సాధిస్తారని అంతా భావించారు. కానీ భారత షట్లర్లు తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో వారి ప్రదర్శనలపై విమర్శలు వచ్చాయి.
Paris Olympics 2024 Badminton Funds : ఈ క్రమంలోనే ఒలింపిక్స్ సన్నద్ధం కోసం రూ.470 కోట్లు కేటాయించినట్లు పీటీఐలో కథనం వచ్చింది. ముఖ్యంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులకు కేంద్రం రూ.72 కోట్లు కేటాయించిందని అందులో రాసి ఉంది. పీవీ సింధు శిక్షణకు రూ.3.13 కోట్లు ఖర్చు చేసినట్లు ఉండగా, మహిళల డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్ప - తనీషా క్రాస్టోకు రూ.1.5 కోట్లు ఖర్చు చేసిందని ఉంది. దీంతో ఇతర మీడియా సైట్లు కూడా ఈ కథనాన్నే ప్రచురించాయి.
అయితే ఈ కథనంపై స్టార్ షట్లర్ అశ్విని పొన్నప్ప తీవ్రంగా స్పందించింది. తమకు ఎలాంటి నిధులు అందలేదని క్లారిటీ ఇచ్చింది. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి కథనాలు ఎలా రాస్తారు? అని ప్రశ్నించింది. "మేమిద్దరం కలిసి రూ.1.50 కోట్లు అందుకున్నామా? ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? నేను ఏ టార్గెట్ ఒలింపిక్ పోడియం(టాప్) పథకంలోనూ భాగం అవ్వలేదు. నిజం ఏంటో తెలుసుకోకుండా ఇలాంటి కథనాలు ఎలా రాసేస్తారు? గతేడాది నవంబరు వరకు కూడా సొంతంగానే నిధులు సమకూర్చుకున్నాను. ఆ తర్వాత సెలక్షన్లలో ఎంపిక అవ్వడం వల్ల టోర్నీలకు పంపించారు. పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్స్(Paris Olympics Qualifications) మొత్తం పూర్తయ్యాకే నన్ను టాప్ పథకంలో భాగం చేశారు. అది కూడా గేమ్స్ పూర్తయ్యే వరకే. ఏ సంస్థ నుంచి గానీ, సీఎస్‌ఆర్ డెవలప్‌మెంట్ గ్రూప్‌ల నుంచి కానీ డబ్బులు అందలేదు. నేను తీసుకోలేదు. మా డబుల్స్ టీమ్‌లో భాగమైన కోచ్‌ను మాతో పంపించమని మాత్రమే అడిగాం. అయినా దాన్ని కూడా వాళ్లు తిరస్కరించారు" అని అశ్విని పొన్నప్ప చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.