Pairis Olympics 2024 Chou Tien Chen : ఒలింపిక్స్‌లో పాల్గొని మెడల్స్ సాధించాలనేది ప్రతీ క్రీడాకారుడి చిరకాల కల. అంతర్జాతీయ వేదికపై తమ దేశం తరఫున ప్రాతినిథ్యం వహించడం కోసం కఠోరంగా శ్రమిస్తారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతకాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్‌లో భారత్ స్టార్ షట్లర్ లక్ష్యసేన్ దూసుకెళ్తున్నాడు. అయితే క్వార్టర్ ఫైనల్స్‌లో భారత షట్లర్ లక్ష్య సేన్‌పై తైవాన్‌కు చెందిన 12 సీడ్ ప్లేయర్ చో చెన్ ఓడిపోయాడు. వాస్తవానికి అతడు ఈ పోరులో గట్టి పోటి ఇచ్చాడు. కానీ చివరికి ఓడిపోయాడు. 19-21, 21-15, 21-12 తేడాతో ఓటమి పాలయ్యాడు. దీంతో అతడు అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే చో చెన్ గురించి ఆలస్యంగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది.
కొలెరెక్టల్ క్యాన్సర్ - అదేంటంటే చో చెన్‌కు కొలెరెక్టల్ క్యాన్సర్ ఉన్నట్లు గతేడాది పరీక్షలో తేలింది. ఈ వియయాన్ని చెన్ తాజాగా తెలిపాడు. క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించడం వల్ల ట్రీట్మెంట్ తీసుకున్నట్లు వెల్లడించాడు. కానీ దీని గురించి తన కుటుంబం సభ్యులకు, స్నేహితులకు కూడా చెప్పలేదని పేర్కొన్నాడు. వైద్యుల అనుమతితోనే ఈ ఒలింపిక్స్‌లో పాల్గొన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇంకా తన టాలెంట్‌ను గుర్తించి ఒలింపిక్స్‌లో పాల్గొనేలా ఛాన్స్ ఇచ్చినవారికి కృతజ్ఞతలు తెలిపాడు.
‘‘గతే సంవత్సరం నాకు క్యాన్సర్ ఉందని పరీక్షల్లో తేలింది. అది ఎంతో డేంజర్ అని, కోలుకునేందుకు ఏడాది సమయం పడుతుందని వైద్యులు అన్నారు. దీంతో ఎంతో ఆలోచించాను. ఏదైమైనా క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించగలగడం వల్ల మేలు జరిగింది. శస్త్రచికిత్స చేయించుకున్నాను. ఒకవేళ ముందే గుర్తించలేక పోయి ఉంటే ఈ రోజు మీ అందరి ముందు ఉండేవాడిని కాదు. చాలా సార్లు ఎంతో ధైర్యం చెప్పుకున్నాను. ప్రశాంతంగా ఆలోచించాను’’ అని చెప్పుకొచ్చాడు.
సర్జరీ తర్వాత చెన్ వేగంగా కోలుకుని బాడ్మింటన్ కోర్టులో ఆడటం మొదలుపెట్టాడు. ఫిట్‌నెస్ కూడా త్వరగానే సాధించాడు. అలా గతేడాది మార్చిలో స్విస్ ఓపెన్‌లో పాల్గొని సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. అనంతరం నవంబరులో జర్మనీలో హైలో ఓపెన్‌లో గెలిచాడు.